భూగర్భంలో ఎవరెస్ట్ కంటే పెద్ద పర్వతాలున్నయ్

భూగర్భంలో ఎవరెస్ట్ కంటే  పెద్ద పర్వతాలున్నయ్
  • 38 కిలో మీటర్ల ఎత్తు ఉన్నట్లు నిర్ధారణ
  • హై డెఫినిషన్ ఇమేజింగ్ పద్ధతిలో గుర్తించిన సైంటిస్టులు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. ఇది 8,848 మీటర్ల ఎత్తు ఉంటుంది. అయితే, మౌంట్ ఎవరెస్ట్ కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎత్తైన పర్వతాలను సైంటిస్టులు కనుగొన్నారు. అయితే, అవి భూమిపై కాదు.. భూగర్భంలో ఉన్నట్లు చెబుతున్నారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు.. అంటార్కిటికాలోని భూకంప శాస్త్ర కేంద్రాలను ఉపయోగించి వీటిని కనుగొన్నారు. భూమికి 2,900 కిలో మీటర్ల లోతులో కోర్, మాంటిల్ మధ్య ఈ భారీ పర్వతాలను  గుర్తించారు. ఇంతకాలం భూకంపాలు, అణు విస్ఫోటనాలు గుర్తించేందుకు తగినంత డేటా లేకపోవడంతో వీటిని కనుగొనలేకపోయామని సైంటిస్టులు చెబుతున్నారు.

భూకంప రికార్డింగ్​లు విశ్లేషించి..

ఈ భారీ పర్వత శ్రేణులు ఏకంగా 38 కిలో మీటర్ల ఎత్తు ఉన్నాయని అరిజోనా వర్సిటీ జియోఫిజిసిస్ట్ ఎడ్వర్డ్ గార్నెరో తెలిపారు. ఎవరెస్ట్ (8.8 కిలో మీటర్లు) పర్వతంతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దవని చెప్పారు. హై డెఫినిషన్ ఇమేజింగ్ పద్ధతిలో అంటార్కిటికా నుంచి వేలాది భూకంప రికార్డింగ్​లు విశ్లేషించడంతో ఈ పర్వత శ్రేణుల గురించి తెలిసిందన్నారు.

సముద్రపు క్రస్ట్​లతోనే ఆవిర్భావం

భూగర్భ పర్వత శిఖరాలు ఏర్పడటానికి గల కారణాలను కూడా నిపుణులు వివరించారు. భూమి లోపల సముద్రపు క్రస్ట్​లు ఏర్పడటంతోనే ఇవి ఆవిర్భవించినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. టెక్టోనిక్ ప్లేట్లు భూ గ్రహంలోని మాంటిల్​లోకి జారడంతో ఇవి ఏర్పడటం ప్రారంభమై ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఇవి నెమ్మదిగా విస్తరించడంతో పర్వతం లాంటి నిర్మాణాలు ఏర్పడినట్లు చెబుతున్నారు. ఈ పర్వతాలు పురాతన సముద్రపు క్రస్ట్​తో తయారయ్యాయని అంటున్నారు.