విశ్లేషణ: నోటిఫికేషన్లు రాక నిరుద్యోగుల గోస

విశ్లేషణ: నోటిఫికేషన్లు రాక నిరుద్యోగుల గోస

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే కొలువులు వస్తయని యువకులు, స్టూడెంట్స్, నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి కొట్లాడిన్రు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్​దాకా ఎక్కడికక్కడ రోడ్ల పైకి వచ్చి ఉద్యమించారు. యూనివర్సిటీలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. వర్సిటీల్లో చదివే స్టూడెంట్స్​చదువులు పక్కకు పెట్టి మరీ రాష్ట్ర సాధన బాధ్యత తీసుకొని లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ పోరులో ఎంతో మంది ప్రాణాలర్పించారు. కానీ ఏడేండ్ల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు. విలువైన సమయం, చదువు కోల్పోయి ఉద్యమం చేసిన స్టూడెంట్స్ స్వరాష్ట్రంలో నిరుద్యోగులుగానే మిగిలారు. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయలేదు. పైగా ఇప్పుడు వారే స్వరాష్ట్ర ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రాణాలకు తెగించి కొట్లాడిన స్టూడెంట్స్​కు ఏమీ దక్కకపోగా.. అనాడు ఉద్యమాన్ని తప్పు పట్టిన ఎంతో మంది నాయకులు ఇయ్యాల మంచి మంచి పదవుల్లో కొనసాగుతున్నరు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యమ ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నా.. నోటిఫికేషన్లు వేయడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన కేజీ టు పీజీ విద్య హామీ అమలుకావడం లేదు. ప్రభుత్వ స్కూళ్లూ మూతపడుతున్నాయి. రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోంది. వీటిపై దృష్టి పెట్టిన సర్కారు.. ఆదాయం పెంచుకోవడానికి విచ్చలవిడిగా కొత్త మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇస్తున్నది. 2014–- 2015 ఏడాదిలో రూ. 25 వేలు ఉన్న మద్యం దుకాణం అప్లికేషన్ ఫీజును రూ.2 లక్షలకు పెంచింది. అప్లికేషన్​ఫీజు పేరుతోనే వందల కోట్లు వసూలు చేస్తోంది. విద్య, వైద్య రంగాల్లో క్వాలిటీ సర్వీస్​పెంచి ఉచిత సేవలు అందించాల్సింది పోయి.. వాటిని పట్టించుకోవడం లేదు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా.. వైన్, బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ వారిని మద్యానికి బానిసలను చేస్తోంది. పస్తులు ఉండి మరీ తెలంగాణ పోరాటంలో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల్లో మహబూబ్​నగర్ జిల్లా ఒకటి.  వలసలకు పేరున్న ఈ జిల్లా స్టూడెంట్స్​ తెలంగాణ వస్తే.. కొలువులు వస్తాయని ఆశపడ్డారు. కానీ మహబూబ్​నగర్ జిల్లాను విభజించి కొత్త జిల్లాలు చేశారు.. కొత్తగా వైన్​షాపులు పెట్టారు కానీ అభివృద్ధి జరగలేదు. ఉద్యోగాలు రాలేదు. ఆరేండ్ల కింద 68 ఉన్న నోటిఫైడ్ వైన్​షాపులు ఇప్పుడు 362కి పెరిగాయి తప్పా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. 

ఉద్యోగాలు భర్తీ చేయాలె..

తెలంగాణ ఏర్పాటు తర్వాత పది ఉమ్మడి జిల్లాలను ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. తండాలను గ్రామ పంచాయతీలుగా, అర్హత ఉన్న కొన్నింటిని మండలాలు కూడా చేసింది. పాలనాపరంగా విభజన మంచి నిర్ణయమే. అయితే కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు చేసిన ప్రభుత్వం వాటిల్లో గల ఖాళీలను నింపడంపై దృష్టి పెట్టడం లేదు. ఇలా 33 జిల్లాల్లోనూ వందల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​తోపాటు, ఇన్ చార్జిలతో పాలన నడుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జిల్లా స్థాయి ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ ప్రక్రియ చేపట్టాలి. స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి. అప్పుడే నిరుద్యోగ సమస్య తీరడంతోపాటు.. ఆయా జిల్లాలు, మండలాలు అభివృద్ధి సాధించగలుగుతాయి. 

ఉద్యోగులకు అన్యాయమే..

ప్రభుత్వ నిర్ణయాలతో ఉద్యోగులకు కూడా నష్టం జరుగుతోంది. 33 జిల్లాల్లో పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంస్థలు, ఆయా డిపార్ట్​మెంట్లకు సంబంధించిన ఆఫీసులు లేవు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల విభజనలో వారికి అన్యాయం జరుగుతోంది. కొన్ని శాఖల్లో అయితే పక్క జిల్లాలో కూడా పని చేసే పరిస్థితి లేదు. దీంతో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తోంది. స్థానికత అంశంపైనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందని, ఇప్పుడు ఆ స్థానికతే ప్రశ్నార్థకంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని పంపించేస్తామని అప్పటి నాయకులు ప్రకటించారు. హైదరాబాద్​తోపాటు సమీప జిల్లాల్లో ఇతర రాష్ట్రాల వారు భారీగా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ప్రసంగాలు దంచారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి ఇక్కడే ఉండే విధంగా చేశారు. అలా ఇతర రాష్ట్రంలో పుట్టి తెలంగాణలోనే ఉన్న చాలా మంది ఉద్యోగులు ప్రస్తుత విభజన ప్రక్రియ సీనియారిటీ లిస్ట్​లో ముందు వరుసలో ఉండి ప్రమోషన్లు పొందుతున్నారు. తెలంగాణలో పుట్టిన వారికి మాత్రం వారి సొంత జిల్లాలో పోస్టింగ్ రావడం లేదు. ఇలా ఉద్యోగులు కూడా అన్యాయానికి గురవుతున్నారు. స్థానికత గాకుండా.. సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఉద్యోగులతోపాటు రూరల్​జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరుగుతోంది. సీనియార్టీ ఉన్న ఉద్యోగులు అర్బన్​జిల్లాలు ఎంచుకుంటుండగా.. జూనియర్​ఉద్యోగులు రూరల్​జిల్లాలకు వెళ్తున్నారు. అర్బన్ జిల్లాలకు వెళ్తున్న సీనియర్లు మరో రెండు మూడు ఏండ్లలో రిటైర్​అవనుండగా.. జూనియర్లు ఇంకో 15 ఏండ్లపాటు పోస్టులో కొనసాగుతారు. దీని వల్ల రూరల్​జిల్లాల్లో ఇప్పుడప్పుడే ఖాళీలు ఏర్పడవు. దీని వల్ల అక్కడ జిల్లా కేడర్​ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న​నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.

రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో నష్టం

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచిన రాష్ట్ర సర్కారు యువతకు భారీగా నష్టం చేసింది. ఏజ్​పెంపు వల్ల ఉద్యోగుల పదవీ విరమణ మరో రెండు మూడేండ్లు వాయిదా పడి పోస్టులు ఖాళీ కావడం లేదు. కానీ నిరుద్యోగుల అర్హత ఏజ్​మాత్రం పెరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న  వేలాది మంది ఉద్యోగాల అర్హత వయసు దాటిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయాల్సన ప్రభుత్వం.. ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఎవరూ అడగకపోయినా.. ఉద్యోగుల రిటైర్మెంట్​ఏజ్​పెంచింది. నిజానికి పదవీ విరమణ ఏజ్​పెంపు ఉద్యోగులకు కూడా నచ్చలేదు. వారి వయసు పెంచడం ద్వారా రెండు మూడేండ్లపాటు వారికి రిటైర్మెంట్​సమయంలో చెల్లించాల్సిన మొత్తాన్ని ముందుకు జరిపేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించి ఉద్యోగుల రిటైర్మెంట్​ఏజ్​తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి.

నోటిఫికేషన్లు ఇయ్యాలె

పీఆర్సీ కోసం వేసిన బిశ్వాల్​కమిటీ రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. రిపోర్టు ఇచ్చినప్పటి నుంచి కూడా వందల సంఖ్యలో రిటైర్మెంట్లు జరిగాయి. ఈ లెక్కన దాదాపు 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం వెంటనే రిక్రూట్​చేయాలి. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్​సెంటర్లలో ప్రిపేర్​అవుతున్నారు. యూనివర్సిటీలు, లైబ్రరీల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అలాంటి నిరుద్యోగుల ఉద్యోగ అర్హత వయసు దాటిపోకముందే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇయ్యాలి. లేదంటే ప్రభుత్వంపై స్టూడెంట్లు, నిరుద్యోగులతోపాటు అన్ని వర్గాల అసంతృప్తి పెరిగి మరో ఉద్యమానికి దారితీస్తుంది.

- ముచ్కుర్ సుమన్ గౌడ్, సామాజిక కార్యకర్త