తొమ్మిదేండ్లలో ఊహించని ప్రగతి సాధించినం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తొమ్మిదేండ్లలో ఊహించని ప్రగతి సాధించినం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
  • జిల్లా కేంద్రాల్లో సమైక్యతా దినోత్సవం

వనపర్తి, వెలుగు: తొమ్మిదేండ్లలో ఊహించని ప్రగతి సాధించి దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వనపర్తి కలెక్టరేట్ లో సమైక్యతా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీఆర్ఎల్ఐ ప్రారంభంతో ఉమ్మడి పాలమూరులో సాగునీటి కష్టాలు దూరమవుతాయని పేర్కొన్నారు. ఈ స్కీమ్​ కంప్లీట్​ అయితే ఆరు జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అనంతరం వనపర్తి వేంకటేశ్వరస్వామి ఆలయంలో  కృష్ణానీటితో అభిషేకం  నిర్వహించారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జడ్పీ చైర్మన్  లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్: రాష్ట్రంతో పాటు జిల్లాలో సుస్థిర ఆర్థిక ప్రగతి సాధించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు.  సమైక్యతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడు వకీల్  భీమయ్యను సన్మానించారు. జడ్పీ చైర్ పర్సన్  స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్  జి.రవినాయక్, ఎస్పీ కె.నరసింహ, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

నారాయణపేట: జిల్లా అభివృద్ధికి బలమైన అడుగులు వేస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్  చైర్​పర్సన్  వాకిటి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. నారాయణపేటలో జాతీయ జెండాను ఎగురవేసి, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. జడ్పీ చైర్​పర్సన్ వనజమ్మ, కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
గద్వాల: అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నామని డిప్యూటీ స్పీకర్  పద్మారావు గౌడ్  తెలిపారు.

Also Rard: నా పోటీ ఎక్కడనేది.. ఏఐసీసీ నిర్ణయిస్తుంది: పొంగులేటి

సమైక్యతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్  ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. బాలభవన్  చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ సృజన, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం పాల్గొన్నారు. ఇదిలాఉంటే జడ్పీ చైర్​పర్సన్  సరిత ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్: నాగర్​కర్నూల్​ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు నిలయమని ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్  పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. కలెక్టర్  పి ఉదయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్  శాంత కుమారి, ఎస్పీ కె మనోహర్  పాల్గొన్నారు.