ఎక్కడా పూర్తికాని క్రీడా ప్రాంగణాలు..వానొస్తే నీళ్లలోనే మైదానం

ఎక్కడా పూర్తికాని క్రీడా ప్రాంగణాలు..వానొస్తే నీళ్లలోనే మైదానం

మెదక్​, వెలుగు: క్రీడలను ప్రోత్సహించి టాలెంట్ ఉన్న ప్లేయర్లను పైకితేవాలన్న లక్ష్యంతో  అన్ని గ్రామాల్లో,  పట్టణాల్లోని ప్రతి వార్డులో  క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ప్రాజెక్ట్​ చేపట్టారు. ఒక ఎకరం విస్తీర్ణంలో ప్లే గ్రౌండ్​ ఏర్పాటు చేయాలని, అందులో  ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులు, లాంగ్​ జంప్ పిట్​లతో పాటు వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని గైడ్​ లైన్స్​లో పేర్కొన్నారు. ఎంపిక చేసిన స్థలం చుట్టూ ఫెన్సింగ్​ మాదిరిగా కానుగు, గుల్​మోహర్​, నిమ్మ, చింత, బాదాం, వెదురు, తంగేడు చెట్లు పెంచాలని నిర్ణయించారు.

 తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2  నాటికి ప్రతి మండలంలో రెండు గ్రౌండ్లను రెడీ చేయాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్​మెంట్​ కమిషనర్ నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు  స్థలాల ఎంపిక చేపట్టారు. చాలా చోట్ల అనువైన స్థలాలు దొరకలేదు. స్థలాలు అందుబాటులో ఉన్న చోట చదును చేసి, బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారుల లెక్క ప్రకారం జిల్లా వ్యాప్తంగా 40 చోట్ల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. అట్టహాసంగా ఎమ్మెల్యేలు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించినా.. ప్లేయర్లకు అందుబాటులోకి తేవడంలో  అధికారులు విఫలమయ్యారు. దీంతో చాలా చోట్ల ఇవి బోర్డులకే పరిమితమయ్యాయి.  

కౌడిపల్లి మండలం వెల్మకన్న, తునికి గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ చుట్టూ రక్షణగా మొక్కలు పెంచలేదు. ఒక వాలీబాల్, నెట్ మాత్రమే పంపిణీ చేశారు. పూర్తిస్థాయిలో వసతులు సమకూరక, క్రీడా పరికరాలు లేక యువకులు, విద్యార్థులు ఆటలు ఆడటానికి ఆసక్తి చూపడం లేదు. తునికి గ్రామంలో ఆట స్థలానికి సమీపంలో మెయిన్ రోడ్డు ఉండడంతో ఇబ్బందిగా ఉంది. రామాయంపేట మండలానికి మూడు  క్రీడా ప్రాంగణాలు మంజూరు కాగా,  అందులో డి. ధర్మారం, సుతారిపల్లి పనులు మొదలయ్యాయి. రామాయంపేట  పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణంలోకి వర్షపు నీరు చేరి అధ్వానంగా మారింది.

నిజాంపేట మండలంలోని 14 గ్రామాలకు గాను 10 గ్రామాల్లో స్థలాలు గుర్తించారు. వీటిలో నందిగామ, రాంపూర్ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కాగా నందిగామలో క్రీడా ప్రాంగణం మొత్తం పిచ్చిమొక్కలతో ఉంది. దీనిలో సింగిల్ స్టాండ్ బార్, డబుల్ స్టాండ్ బార్ లు ఏర్పాటు చేయలేదు. రాంపూర్ లో క్రీడా ప్రాంగణంలో అన్ని ఉన్నా చుట్టూ రక్షణగా ఏమి లేకపోవడంతో పశువులకు నిలయంగా మారింది. మెదక్​ మండలం మంబోజిపల్లిలో చెరువు శిఖాన్ని ఆనుకుని క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. పెద్ద వర్షం కురిస్తే చెరువు నిండి మైదానం జలమయం అవుతోంది. దీనివల్ల అక్కడ ఆటలు ఆడలేని పరిస్థితి నెలకొంది.