మార్కెట్‌‌‌‌కు రాని ట్రేడర్లు ప్రారంభం కాని కొనుగోళ్లు

మార్కెట్‌‌‌‌కు రాని ట్రేడర్లు ప్రారంభం కాని  కొనుగోళ్లు
  •      మద్దతు ధర ఇవ్వలేమంటూ జనగామ మార్కెట్‌‌‌‌యార్డులో వడ్లు కొనని ట్రేడర్లు
  •     డబ్బులు అవసరం కాబట్టే ఇక్కడిదాకా వచ్చామంటున్న రైతులు
  •     తేమ ఆధారంగా కొనుగోళ్లు జరిగేలా చూడాలని ఆఫీసర్లతో వాగ్వాదం
  •     ఈ – నామ్‌‌‌‌ విధానంలో నేడు వడ్ల కొనుగోలు

జనగామ, వెలుగు: జనగామ మార్కెట్‌‌‌‌లో వడ్ల కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. మద్దతు ధర చెల్లించాల్సిందే అని ఆఫీసర్లు ట్రేడర్లను ఆదేశించడం, ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేయడంతో ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. మూడు రోజుల సెలవుల అనంతరం సోమవారమైనా కొనుగోళ్లు జరుగుతాయని ఆశించినప్పటికీ ట్రేడర్లు అసలు మార్కెట్‌‌‌‌కే రాలేదు. దీంతో మార్కెట్‌‌‌‌ యార్డు మొత్తం వడ్ల రాశులతో నిండిపోయింది. యార్డులో ప్రస్తుతం 25 వేల బస్తాల వడ్లు కొనుగోలుకు రెడీగా ఉన్నాయి. మరో వైపు డబ్బులు  అత్యవసరం కాబట్టే ఇక్కడికి వచ్చాం, ట్రేడర్లతో మాట్లాడి తేమ ఆధారంగా వడ్లు కొనేలా చూడాలని రైతులు ఆందోళనకు దిగారు.

జనగామలోనే రూల్స్‌‌‌‌ ఎందుకు ?

తెలంగాణలోని పలు మార్కెట్‌‌‌‌ యార్డుల్లో ఈ–నామ్‌‌‌‌ విధానంలో క్వాలిటీ ఆధారంగా కొనుగోళ్లు జరుగుతుండగా, జనగామలో మాత్రం కచ్చితంగా మద్దతుధర ఇవ్వాలని రూల్స్‌‌‌‌ పెట్టడం ఏంటని ట్రేడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతా ఒకలా ఉంటే జనగామ మార్కెట్‌‌‌‌లో మరోలా వ్యవహరించడం తగదంటున్నారు. మద్దతు ధర చెల్లించడం తమకు వీలు కాదనీ, ఆ ధర కావాలంటే సర్కార్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోనే వడ్లు కొనాలని స్పష్టం చేశారు.

డబ్బులు అత్యవసరం కాబట్టే ఇక్కడికి వచ్చాం

అవసరానికి డబ్బులు అందాలని మార్కెట్‌‌‌‌ యార్డుకు వస్తే సర్కార్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోనే అమ్ముకోవాలని ఆఫీసర్లు ఒత్తిడి తేవడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మద్దతు ధర కావాలంటే తమ గ్రామంలోని సర్కార్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోనే అమ్ముకునే వాళ్లం, డబ్బులు అత్యవసరం ఉండి, నాలుగైదు రోజులు కష్టపడే ఓపిక లేకనే ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు కొనుగోళ్లు ఆపడం ఏంటి’ అంటూ రైతులు ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. యార్డులో వడ్లు భారీ స్థాయిలో ఉండడం వల్ల ఆరబోయడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. 

నాలుగు రోజులుగా వడ్ల రాశులు వేడెక్కుతాయని, ధాన్యం నల్లగా మారితే బాధ్యత ఎవరిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు ట్రేడర్లతో మాట్లాడి తేమ ఆధారంగా ధరలు నిర్ణయించి కొనుగోళ్లు జరిగేలా చూడాలని పలుమార్లు మార్కెట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్దకు ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆర్డీవో కొమురయ్య, తహసీల్దార్‌‌‌‌ వెంకన్న, వరంగల్‌‌‌‌ డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌ రాజునాయక్‌‌‌‌, డీఎంవో నరేంద్ర మార్కెట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్దకు వచ్చి రైతులకు నచ్చజెప్పారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని, రైతులు వడ్లు ఆరబోసి సర్కార్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో అమ్ముకోవాలని సూచించారు. కొందరు దళారులు రైతులను ఎగదోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నేడు ఈ–నామ్‌‌‌‌ పద్ధతిలో కొనుగోలు
 
జనగామ మార్కెట్ యార్డ్‌‌‌‌లో రైతుల అంగీకారం మేరకు మంగళవారం నుంచి ఈ – నామ్‌‌‌‌ పద్ధతిలో కొనుగోళ్లు నిర్వహిస్తాం. యార్డులో ఇప్పటికే భారీ స్థాయిలో ధాన్యం పేరుకుపోయింది. యార్డులో స్థలం లేనందున ఈ నెల 16, 17న మార్కెట్‌‌‌‌కు వడ్లు తీసుకురావద్దు.

డీఎంవో నరేంద్ర