పేదలకు ఉపయోగం లేని బడ్జెట్

పేదలకు ఉపయోగం లేని బడ్జెట్

ముషీరాబాద్,వెలుగు:  దేశ బడ్జెట్​ పేదలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేదని  అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి. వెంకట్‌‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌‌. వెంకట్రాములు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌కు వ్యతిరేకంగా నేటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 
మంగళవారం గోల్కొండ క్రాస్‌‌రోడ్‌‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను, బడ్జెట్ పేపర్లను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థలను  కేంద్రం కార్పొరేట్‌‌లకు అప్పగిస్తోందన్నారు. కార్పొరేట్‌‌ పన్నును 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ఆహార భద్రతకు, వడ్డీ మాఫీకి, ప్రకృతి వైపరీత్యాలకు, ఆత్మహత్యల నివారణకు బడ్జెట్‌‌లో ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.  రైతులకు అన్యాయం చేసేలా బడ్జెట్​ ఉందన్నారు.  సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్‌‌, రాష్ట్ర నాయకుడు కూరపాటి రమేష్‌‌ తదితరులు పాల్గొన్నారు.  
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్  పూర్తిగా నిరాశపరిచిందని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో  విమర్శించారు. వన్ నేషన్ వన్ మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం రైతు నడ్డి విరిచే చర్య అని పేర్కొన్నారు.  నిరుద్యోగ నిర్మూలనకు,  మహిళలకు,  ఎస్సీ,  ఎస్టీ,  బీసీలకు  ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు.  దివ్యాంగుల అవసరాలను విసర్మించే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్ పీ ఆర్ డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ మరో ప్రకటనలో  పేర్కొంది.