- లక్నో మెట్రో ఫేజ్–1బీకి గ్రీన్ సిగ్నల్
- రూ.5,801 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
న్యూఢిల్లీ: దేశంలో మరో నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిశాలో రెండు, పంజాబ్, ఏపీలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రూ.4,594 కోట్లతో ఏర్పాటు చేయనున్న నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు.
‘‘ఒడిశాలోని భువనేశ్వర్‌లో SiCsem Pvt Ltd కంపెనీ రూ.2,066 కోట్లతో సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సిలికాన్ కార్బైడ్ చాలా దృఢమైన పదార్థం. ఇది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. దీన్ని మన మిసైల్స్, శాటిలైట్స్, టెలికాం టవర్స్, రాకెట్లు, రైల్వే ఇంజన్లు తదితరాల్లో ఉపయోగిస్తాం. ఈ ప్లాంట్‌లో ఏటా 9.6 కోట్ల చిప్స్‌ను తయారు చేస్తారు” అని చెప్పారు.
అలాగే భువనేశ్వర్‌లోనే 3డీ గ్లాస్ సొల్యూషన్స్ కంపెనీ రూ.1,943 కోట్లతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇందులో అమెరికాకు చెందిన ఇంటెల్, లాక్హిడ్ మార్టిన్ కంపెనీలు కూడా పాలుపంచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌లో ఏటా 5 కోట్ల చిప్స్‌ను తయారు చేస్తారని తెలిపారు. ఇందులో 3డీహెచ్‌ఐ మాడ్యూల్స్, అసెంబుల్డ్ యూనిట్స్ తయారు చేస్తారని.. వీటిని డిఫెన్స్, కంప్యూటింగ్, ఏఐ తదితరాల్లో వినియోగిస్తారని వివరించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ (ఏఎస్ఐపీ) కంపెనీ రూ.468 కోట్లతో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీన్ని సౌత్ కొరియాకు చెందిన ఏపీఏసీటీ కంపెనీతో కలిసి ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఏటా 9.6 కోట్ల చిప్స్ తయారు చేస్తారు. వీటిని ఫోన్లు, సెటప్ బాక్స్‌లు, ఆటోమొబైల్ అప్లికేషన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు” అని వెల్లడించారు.
ఇక కాంటినెంటల్ డివైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సీడీఐఎల్) కంపెనీ రూ.117 కోట్లతో పంజాబ్ మొహాలీలోని తన ప్లాంట్‌ను విస్తరించనుందని చెప్పారు. దీంతో ఏటా ఉత్పత్తి చేసే సామర్థ్యం 15.8 కోట్ల యూనిట్లకు పెరుగుతుందని పేర్కొన్నారు. కాగా, ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు ప్లాంట్లకు ఆమోదం తెలపగా, ఇప్పుడు మరో నాలుగు ప్లాంట్లకు ఆమోదం తెలిపింది.
లక్నోలో మరో 11 కి.మీ మెట్రో..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,801 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్ 1బీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 11.16 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నారు. ఇందులో మొత్తం 12 స్టేషన్లు రానుండగా, అందులో 7 అండర్‌గ్రౌండ్‌లో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్నోలో మెట్రో నెట్‌వర్క్ 34 కిలోమీటర్లకు పెరుగుతుంది.
అరుణాచల్‌లో 700 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్..
అరుణాచల్‌ప్రదేశ్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.8,146.21 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షి–యోమి జిల్లాలో సియోమ్ నదిపై మొత్తం 700 మెగావాట్ల సామర్థ్యంతో ఒక్కో ప్లాంట్ 175 మెగావాట్ల చొప్పున నాలుగు నిర్మించనున్నారు. దీన్ని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ కలిసి నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.436.13 కోట్ల ఆర్థిక సాయం అందించడంతో పాటు రోడ్లు, బ్రిడ్జీలు, ట్రాన్స్‌మిషన్ లైన్లు తదితర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.458.79 కోట్లు ఇవ్వనుంది.
