పుట్టబోయే ప్రతి బిడ్డ మీద రూ. లక్షా 25వేల అప్పు

పుట్టబోయే ప్రతి బిడ్డ మీద రూ. లక్షా 25వేల అప్పు

ప్రాజెక్టు ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లకు పెరిగినా ఎందుకు మాట్లాడరు?
సీఎం కేసీఆర్​పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ ఫైర్​
బడ్జెట్​లో చూపకుండా అప్పులు చేసుడేంది? 
పుట్టబోయే ప్రతి బిడ్డ మీద రూ. లక్షా 25వేల అప్పు మోపారు
దీనిపై కేంద్రం ప్రశ్నిస్తే.. ఫెడరలిజానికి ముప్పని ఎదురుదాడి చేస్తరా?
రైతులకు ఫసల్​ బీమా ఎందుకు అమలు చేస్తలేరు?.. రుణమాఫీ ఏమైంది? 
భూ నిర్వాసితులకు పరిహారం ఏమైంది? 
రాష్ట్రంపై దృష్టి పెట్టక దేశమంతా పర్యటనలా?

కామారెడ్డి, వెలుగు : ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో లిఫ్ట్​ చేస్తున్నది నీళ్లా.. పైసలా?  ఏది లిఫ్ట్​ చేస్తున్నరో తెలియట్లేదు. లిఫ్ట్​ చేసినవి పొలాలకు వెళ్తున్నయా..  వేరే ఎక్కడికైనా వెళ్తున్నయా” అని సీఎం కేసీఆర్​ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ప్రశ్నించారు. ప్రాజెక్టులకు కేంద్రం సహకరించట్లేదనడం సరికాదన్నారు. బడ్జెట్​లో చూపకుండా బయట ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారని, వాటిని తిరిగి చెల్లించాల్సింది ప్రజలే అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. మిగులు బడ్జెట్​లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా రూ. లక్షా 25 వేల అప్పును మోపారని మండిపడ్డారు. వీటిపై కేంద్రం ప్రశ్నిస్తే.. ఫెడరలిజానికే ముప్పని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నదని, ఇదేం పద్ధతి అని ఆమె నిలదీశారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో  జరిగిన ‘జహీరాబాద్​ పార్లమెంట్​ ప్రవాస్​ యోజన’ మీటింగ్​లో నిర్మలా సీతారామన్​ మాట్లాడారు. ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పరిహారం ఇవ్వకపోవడం ఏమిటని  ప్రశ్నించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మళ్లీ కేంద్రాన్ని ప్రశ్నిస్తారు. ఇరిగేషన్​ ప్రాజెక్టులు డిలే అయితే కాస్ట్ పెరిగేది నార్మలే.  5, 10, 15 శాతం వరకు పెరుగుతుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ మూడింతలు ఎందుకు పెరిగింది”  అని నిలదీశారు.

‘‘రూ. 38,500 కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు  రూ.లక్షా 25 వేల కోట్లకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇంతలా పెరగడంపై స్టేట్ గవర్నమెంట్  ఎందుకు మాట్లాడటం లేదు? ” అని నిర్మల నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. ఇవన్నీ చెప్పకుండా కేంద్రంపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ‘‘పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం తెచ్చిన పీఎం ఆవాస్​ యోజనను ఇక్కడ డబుల్​ బెడ్రూం స్కీమ్​గా మార్చి నడుపుతున్నారు. పేరు మార్చారా..? లేదా?  పీఎం మత్స్య సంపద యోజన స్కీమ్​ పేరును కూడా మార్చారా లేదా?” అని ప్రశ్నించారు. నేషనల్​ కో అపరేటివ్​ డెవలప్​​మెంట్ కార్పొరేషన్​ ద్వారా గొర్రెల పెంపకానికి కేంద్రం డబ్బులు ఇచ్చిందని, రాష్ట్రంలో దీని పేరు మార్చారని తెలిపారు. డబ్బు కేంద్రం ఇస్తే..పేరు మార్చి సొంత పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని మండిపడ్డారు. ‘‘ఆయుష్మాన్​ భారత్  స్కీమ్​లో  2021 మేలో చేరుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు వరకు ఇక్కడ కంప్లీట్​గా స్కీమ్​ను ఇంప్లిమెంట్​ చేయడం లేదు. ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​ ద్వారా రూ. 5 లక్షలతో ప్రజలు ట్రీట్​మెంట్​ పొందే వీలుంది. ఎక్కడ జనానికి ప్రధానమంత్రి మోడీ పేరు తెలిసిపోతుందోనని, హాస్పిటళ్లు  సరిగ్గా లేవనే విషయం తెలిసిపోతుందోనని రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్​ను ఇంప్లిమెంట్​ చేయడం లేదు” అని అన్నారు.

ఫసల్​ బీమా ఎందుకు అమలు చేయట్లే?
నేషనల్ ​క్రైం రికార్డ్స్​  బ్యూరో రిలీజ్​ చేసిన రిపోర్ట్​ ప్రకారం..  రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో  4వ స్థానంలో ఉందని, మినిస్ట్రీ ఆఫ్​  స్టాటిస్టిక్​ అండ్​ ప్రోగ్రాం ప్రకారం.. తెలంగాణలో ప్రతి 100 మంది రైతుల్లో  91.7 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నారని నిర్మల చెప్పారు. రాష్ట్రంలో పీఎంఫసల్​ బీమా యోజన స్కీంను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, సీడ్​ వేసిన దగ్గరి నుంచి పంట చేతికొచ్చే వరకు ఏ విధంగా నష్టం జరిగిన రైతులకు ఈ స్కీమ్​తో లాభం జరిగేదని తెలిపారు. ‘‘రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని సీఎం వాగ్దానం చేశారు. కానీ పూర్తి స్థాయిలో నేరవేర్చలేదు.  రైతులకు రూ. 27,500 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మేం అడిగితే రైతులకు అన్ని చేశామంటారు. కానీ, ఫసల్​ బీమా యోజన స్కీం అమలు చేయరు. రుణమాఫీ చేయరు. ఇవి చేసి ఉంటే.. రైతులకు బాకీలు ఉండేవి కాదు.. ఆత్మహత్య చేసుకునేవారు కాదు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులకు బీమా లేదు” అని అన్నారు.

రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది పోయి.. !
ముందు రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది పోయి .. దేశమంతా తిరుగుతున్నారని కేసీఆర్​పై కేంద్ర మంత్రి నిర్మల ఫైర్​ అయ్యారు. ‘‘కేసీఆర్​ బీహార్​కు వెళ్తే  అక్కడి సీఎం కూర్చోకుండా నిలబడి.. ‘చాలు అపండీ  వెళ్దాం’ అనే పరిస్థితి వచ్చింది. నేను తెలంగాణ ప్రజలకు నమస్కారం చేసి అడుగుతున్నా... రాష్ట్రాన్ని జాగ్రత్తగా గమనించుకోండి” అని అన్నారు. స్కీమ్​లపై కేంద్రంతో పాటు, ప్రజలు, ప్రతిపక్ష పార్టీలకు అడిగే హక్కు ఉందని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల ప్రకారం క్షేత్ర స్థాయిలో పనులు ఉన్నాయా..? ఉంటే చూపెట్టండి” అని డిమాండ్​ చేశారు. ‘‘ఉపాధి హామీ స్కీమ్​ను రద్దు చేస్తామని మేం చెప్పలేదు.  8 ఏండ్లలో ఈ స్కీమ్​ కింద దేశంలో రూ. 5 లక్షల కోట్లు ఖర్చు చేస్తే  తెలంగాణకు రూ. 20 వేల కోట్లు ఇచ్చాం.  స్కీమ్​లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే సర్వే చేస్తున్నాం. వివరాలు సరిగ్గా చెప్పాలి కదా. సర్వే చేస్తుంటే  ప్రజలను భయపెట్టేందుకు.. ఉపాధి హామీ స్కీమ్​ బంద్ పెడుతున్నారనటం సరికాదు.  యూపీఎ గవర్నమెంట్ కంటే ఉపాధిహామీ స్కీమ్​ బాగా అమలు చేస్తున్నాం” అని నిర్మల స్పష్టం చేశారు. ‘‘పార్లమెంట్​లో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర స్కీమ్​లను అమలు చేస్తున్నాం.  ప్రజల కోసం తీసుకొచ్చిన స్కీమ్​లు అవి.  కానీ, స్టేట్​లో వాటి పేర్లను మారుస్తున్నారు.  పేర్లు ఎందుకు మార్చారని కేంద్రం అడిగితే.. మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని అంటున్నారు.  కేంద్ర స్కీమ్​ల పేరు మార్చినా.. సరిగ్గా ఇంప్లిమెంట్​ చేయకున్నా కేంద్రం ప్రశ్నిస్తుంది” అని తేల్చిచెప్పారు. 

పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తరు
కేసీఆర్​ పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారని, కానీ వాటిని నెరవేర్చరని నిర్మల విమర్శించారు. సెంట్రల్ స్కీమ్​లకు పేర్లు మార్చి, అన్ని తామే ఇచ్చినట్లు ప్రజలకు రాష్ట్రం చెప్పుకుంటున్నదని దుయ్యబట్టారు. లోక్​సభ ప్రవాస్​ యోజనలో భాగంగా క్షేత్ర స్థాయిలో కేంద్ర స్కీమ్​లను పరిశీలిస్తామన్నారు. మిగులు బడ్జెట్​ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్​పై మండిపడ్డారు. ‘‘బడ్జెట్​లో చూపకుండా బయట లోన్​ తీసుకుంటున్నారు. అసెంబ్లీలో అనుమతి తీసుకోకుండా.. అంటే బడ్జెట్​లో పెట్టకుండా.. అప్పులు తీసుకుంటే ఎట్లా? వాటిని తీర్చేది ఎవరు? ప్రజలే కదా” అని ప్రశ్నించారు. ‘‘బడ్జెట్​లో చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం బయట తీసుకుంటున్న అప్పులు పెరిగిపోతున్నాయి. దీనిపై కేంద్రం అడిగితే.. మాకు కేంద్రం సహకరించట్లేదని, స్టేట్​ గవర్నమెంట్ అధికారాలపై కేంద్రం  కోత పెడుతున్నదని అంటారు. ఇదేం పద్ధతి?” అని నిలదీశారు. ఎఫ్​ఆర్​బీఎం లిమిట్​ను రాష్ట్ర ప్రభుత్వం దాటిపోతున్నదని తెలిపారు.