టీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం

టీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. కోవిడ్-19 సమయంలో మారటోరియంపై  ఒక్కో  బ్యాంకు ఒక్కో తరహా విధానం అమలు చేస్తోందని.. దీని వల్ల అనేక మంది చిన్న.. మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు గందరగోళంలో ఉన్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. బ్యాంకులకు ఇచ్చిన మారటోరియంపై స్పష్టత ఇవ్వాలని టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది.

కోవిడ్-19 ప్యాకేజి ప్రకారం ఆర్బీఐ 6 నెలల పాటు మారటోరియంకు అనుమతించింది.

మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం అమల్లో ఉంది.

మారటోరియం సమయంలో రుణాల చెల్లింపులు చేయనివారి ఖాతాలు ఎన్పీఏగా పేర్కొన్నారు.

అలాగే సిబిల్ వంటి క్రెడిట్ రేటింగుపైనా ప్రభావం ఉండదు.

మారటోరియం కాలంలో వడ్డీ కొనసాగుతుంది.

అయితే అర్హులైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు వడ్డీ రాయితీ వంటి మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు బ్యాంకులకు ఉందని ఆర్బీఐ పేర్కొంది.

ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం:

బ్యాంకులు వడ్డీ రేటు మార్చవచ్చు,

బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీని పూర్తిగా మినహాయించవచ్చు,

అపరాధ వడ్డీని పూర్తిగా రద్దు చేయవచ్చు.

వడ్డీ మొత్తాన్ని కొత్త రుణంగా పరిగణిస్తూ తిరిగి చెల్లించేందుకు మరింత అదనపు సమయాన్ని ఇవ్వొచ్చు.

మారటోరియం ఉపయోగించుకునే రుణగ్రహీత తన ఖాతాలో సొమ్మును మరో ఖాతాలోకి బదిలీ చేయడాన్ని అడ్డుకునే నిబంధనేమీ లేదు.