కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న సీఎం

కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న సీఎం

నాగర్​కర్నూల్, వెలుగు :  రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా కేసీఆర్ ​అడ్డుకుంటున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. 9 శాతానికి చేరిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడేవారికి, దొంగలకు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారని కామెంట్​ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే డబుల్​ఇంజిన్​ సర్కార్​ రావాల్సిందేనన్నారు. శుక్రవారం నాగర్​కర్నూల్​ జిల్లాలో పర్యటించిన ఆయన ఉదయం కొల్లాపూర్​లో మామిడి రైతులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి కష్టాలడిగి తెలుసుకున్న ఆయన కేంద్రం నుంచి వీలైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని రైతులు మంత్రిని అభ్యర్థించారు. ఉదయం సోమశిల ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి రూ.1100 కోట్ల వ్యయంతో  నిర్మించనున్న కేబుల్​ బ్రిడ్జి ప్రదేశాన్ని విజిట్​ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన లోక్​సభ ప్రవాస్​ యోజనలో పాల్గొన్న ఆయన నాలుగు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ అనుబంధ విభాగాల ఇన్​చార్జీలతో మాట్లాడారు. వరుసగా కేంద్ర పథకాలను ప్రస్తావించిన కేంద్ర మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. డబుల్ ​బెడ్ రూమ్​​ ఇండ్లు ఇస్తామని మాట తప్పిన సీఎం కేసీఆర్​..పీఎం ఆవాస్ యోజన కింద నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు నీడ దొరకకుండా చేశారన్నారు. ఆయుష్మాన్​భారత్​ అమలు కాకుండా అడ్డుకుని ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో 20 వేల డాక్టర్, స్పెషలిస్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో పేదలకు వైద్యం అందక, కార్పొరేట్​లో చేయించుకునే స్థోమత లేక నలిగిపోతున్నారన్నారు. రైల్వే లైన్ల నిర్మాణంలో భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, తెలంగాణలో ఆ పరిస్థితి   కనిపించడం లేదన్నారు.

కేంద్రం 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్న ఆయన.. కేసీఆర్​ప్రకటించిన 96 వేల ఉద్యోగాల నోటిఫికేషన్​ ఎక్కడ మాయమైందన్నారు. భూములు అందుబాటులో  ఉంటే పరిశ్రమల స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ ( మినిస్ట్రీ ఆఫ్​మైక్రో, స్మాల్​అండ్​మీడియం ఎంటర్​ ప్రైజెస్​)సెక్టార్ ​నుంచి ఏ ప్రపోజల్​ వచ్చినా సాయమందిస్తామన్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన వర్తక సమావేశంలో మాట్లాడుతూ వ్యాపార,వాణిజ్యం,పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం పూర్తి తోడ్పాటునిస్తుందన్నారు. ఎంపీ అర్వింద్ ​ఇంటిపై దాడిని ఖండించారు. 

మేము దాడులు చేస్తే ఒక్కడూ మిగలడు

జాతీయ బీసీ కమిషన్​ మాజీ మెంబర్​ టి.ఆచారి మాట్లాడుతూ ఎంపీ అర్వింద్​ ఇంటిపై టీఆర్​ఎస్​ గూండాలు దాడి చేయడాన్నీ ఖండిస్తున్నామన్నారు. దీన్నిబట్టి హైదరాబాద్​ పోలీసులు,స్టేట్​ఇంటెలిజెన్స్​ వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అర్థమవుతుందన్నారు. తాము తిరిగి దాడులు చేస్తే ఒక్కడు మిగలడన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, కొల్లా మాధవి, మైనార్టీ మోర్చా స్టేట్​ప్రెసిడెంట్​అఫ్సర్​పాషా,అధికార ప్రతినిధి కట్టా సుధాకర్, నాగర్​కర్నూల్​, వనపర్తి జిల్లాల అధ్యక్షులు ఎల్లేని సుధాకర్​రావు, రాజవర్ధన్​రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్ష,కార్యదర్శులు,నాగర్​ కర్నూల్​ ఇన్​చార్జీ దిలీపా చారి పాల్గొన్నారు.