
- మానేరుపై బ్రిడ్జి మంజూరుపై బండి సంజయ్‌కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు
కరీంనగర్ సిటీ/గన్నేరువరం, వెలుగు: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసికట్టుగా నడుద్దామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మానేరు వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.77 కోట్లు మంజూరు చేయించినందుకు కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో బుధవారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో గన్నేరువరం మండల ప్రజలు బండి సంజయ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రజల బలమైన కోరిక, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టుదల వల్లే మానేరుపై బ్రిడ్జి నిర్మాణానికి శాంక్షన్ వచ్చిందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రతి ఎన్నికలోనూ ప్రధాన అంశంగా ఉండేదని గుర్తుచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో గన్నేరువరం కాంగ్రెస్ లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేంద్రమంత్రిని కలిసి ఆయనతోపాటు ఎమ్మెల్యే కవ్వంపల్లిని సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్‌రెడ్డి, లీడర్లు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అనంతరెడ్డి, సునీల్, కరుణాకర్ రెడ్డి, సంపత్ రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.