తెలంగాణలో అవినీతి ప్రభుత్వం నడుస్తోంది

తెలంగాణలో అవినీతి ప్రభుత్వం నడుస్తోంది

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అవినీతి ప్రభుత్వం కొనసాగుతుందని, అందుకే ఈ సర్కార్‌‌‌‌ అభివృద్ధిలో వెనుకబడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అవినీతి చేసిన వారు మాత్రమే ఈడీ, సీబీఐలంటే భయపడతారని, తప్పు చేయనప్పుడు భయమెందుకని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌‌ చంపాపేటలో మలక్‌‌పేట అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో సింధియా భేటీ అయ్యారు. తర్వాత పార్టీ రాష్ట్ర​అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు తదితర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌‌ను సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేసి, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. 75 ఏండ్లలో కంటే, మోడీ హయాంలోని ఎనిమిదేండ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ నిధులు వచ్చాయని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ సర్కార్‌‌‌‌కు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పాత బస్తీకి మెట్రో రైలును ఎందుకు విస్తరించడం లేదని ప్రశ్నించారు. పాత బస్తీ సంక్షేమం, అభివృద్ధి బీజేపీ విధానమని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌‌ చరిత్రాత్మకమైందని, అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటామని స్పష్టం చేశారు. పాతబస్తీలో బీజేపీ బలపడడానికి తన వంతు బాధ్యతలను నిర్వర్తించడానికే హైదరాబాద్ వచ్చానన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ముర్మును అవమానించడమంటే గిరిజనులు, మహిళలను అవమానించడమేననన్నారు.

పార్లమెంటరీ ప్రవాసీ యోజనలో భాగంగా పర్యటన

పార్లమెంటరీ ప్రవాసీ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి సింధియా గురువారం హైదరాబాద్ వచ్చారు. పాతబస్తీలోని హోటల్ తాజ్ ఫలక్‌‌నుమాలో బస చేశారు. హైదరాబాద్‌‌ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌‌చార్జిగా ఉన్న ఆయన.. శుక్రవారం మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులతో భేటీ అయ్యారు. ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ అనుబంధ హిందూ సంస్థలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలోపేతం చేసేందుకు వీలుగా ఆయన పర్యటన కొనసాగుతుంది.