అప్పుడే కేసీఆర్ నైజం బయటపడింది..దళితుడిని సీఎం చేస్తానని చెప్పి గద్దెనెక్కారు

 అప్పుడే కేసీఆర్ నైజం బయటపడింది..దళితుడిని సీఎం చేస్తానని చెప్పి గద్దెనెక్కారు
  •  కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే థాను ముక్కలు
  •  వ్యాపారాల కోసమే బీఆర్ఎస్ తో కమ్యూనిస్టుల పొత్తు
  • సీపీఐలో పుట్టిన పువ్వాడకు వేల కోట్లు ఎలా వచ్చాయ్
  • మంత్రి సొంత పార్టీ నేతలనూ భయపెడుతున్నారు
  • 27న ఖమ్మంలో హోం మంత్రి అమిత్ షా పర్యటన
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ఖమ్మం: తెలంగాణ ఏర్పాటైన మొదటి రోజే కేసీఆర్ మోసం మొదలైందని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తానే గద్దెనెక్కారని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే థాను ముక్కలన్నారు. ఇరు పార్టీల కుటుంబ పాలనపై యావత్ తెలంగాణ ఆలోచించాలన్నారు. కమ్యూనిస్టు పార్టీలు వ్యాపారాల కోసమే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు బీఆర్ఎస్ లో మళ్లీ చేరబోరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. 

కేసీఆర్ అవినీతిపై పోరాటాలను జనం కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు సామాన్యుడికి అందని ద్రాక్షగా మారాయని చెప్పారు. తెలంగాణలో ఇండ్లు రావాలంటే కేసిఆర్ గద్దె దిగాల్సిందేనని చెప్పారు. కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా కాగజ్ నగర్ పేపర్ మిల్లు, బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరుచుకోలేదని ప్రశ్నించారు. 

దళితబంధును బీఆర్ఎస్ బంధులా మార్చారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆరు లక్షల కోట్ల అప్పుల ఊబిలో మునిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు అమ్మి జీతాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఖజానాలో డబ్బుల్లేక గడువు ముగియక ముందే వైన్సులకు టెండర్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. పోలీసు అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అక్రమాలను ప్రశ్నించిన బీజేపీ నేతలపై కొందరు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.కమ్యూనిస్టు పార్టీలో పుట్టిన పువ్వాడ అజయ్ కుమార్ వేల కోట్లు ఎలా సంపాదించారో అందరూ అర్థం చేసుకోవాలన్నారు. మంత్రి పువ్వాడకు సొంత పార్టీ నేతలే భయపడుతున్నారంటే ఖమ్మంలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిపోతుందన్నారు. ఈ నెల 27న ఖమ్మం నగరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.