ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు మంచి వాతావరణం 

ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు మంచి వాతావరణం 
  • బంగ్లా పీఎం షేక్ హసీనాతో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: ఇండియా, బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనాల నేతృత్వంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో స్వర్ణయుగం ప్రారంభమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో షేక్ హసీనాతో ఆయన భేటీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ మధ్య బార్డర్ ద్వారా వాణిజ్యం మరింతగా పెరిగితే రెండు దేశాలకూ మేలు జరుగుతుందని ఈ సందర్భంగా బంగ్లా ప్రధానికి కిషన్ రెడ్డి తెలిపారు. బార్డర్ హట్స్, ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్స్, ల్యాండ్ కస్టమ్ స్టేషన్ వ్యవస్థలను బలోపేతం చేస్తే సరిహద్దు వాణిజ్యం ఊపందుకుంటుందని చెప్పారు. రెండు దేశాల మధ్య మల్టీ-మోడల్ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యవసాయ ఉత్పత్తులు, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ పోర్టుల సహకారం, పర్యాటకం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడంపైనా సమావేశంలో చర్చించారు. అనంతరం షేక్  హసీనా సమక్షంలో జరిగిన ఇరుదేశాల పారిశ్రామికవేత్తల సదస్సు(సీఈవో కాన్ఫరెన్స్)లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలతో ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్నారు. అక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఇండస్ట్రియలిస్టులకు భరోసా ఇచ్చారు.