తెలంగాణ పేరు తీసేసినప్పుడే కేసీఆర్ పార్టీ ఖతమైంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ పేరు తీసేసినప్పుడే కేసీఆర్ పార్టీ ఖతమైంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రంగారెడ్డి, వెలుగు: తెలంగాణ పేరు తొలగించిన రోజే  కేసీఆర్ పార్టీ ఖతమైందని, బీజేపీ కనుచూపు మేరలో కూడా కాంగ్రెస్ లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహశ్వరం మండలం అమీర్​పేట్ గ్రామంలో గావ్​చలో (పల్లెకు పోదాం) అభియాన్​ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారన్నారని తెలిపారు.

రైతులు, మహిళలు, రైతు కూలీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం అవుతున్నామని చెప్పారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. పార్లమెంట్​లో ప్రధాని మోదీ అద్భుతంగా ప్రతిపక్షాల నోరు మూయించారన్నారు. మోదీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వమని భూ ప్రపంచంలో ఎవరూ అనలేరని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. 

కాంగ్రెస్​ను ఎవరూ నమ్మడం లేదు

కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు విశ్వాసం లేదని కిషన్​రెడ్డి అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో 25 మందిని కొత్త వారిని చేర్పించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పోలింగ్ బూత్ కమిటీలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. తొమ్మిదిన్నర ఏళ్లలో నిత్యావసర ధరలను మోదీ ప్రభుత్వం తగ్గించగలిగిందన్నారు. బీజేపీకి కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ లేదన్నారు. పోలింగ్ బూత్ లో వంద ఓట్లు పోలైతే.. 51 ఓట్లు బీజేపీకి రావాలని, 70 శాతం ఓట్లు తెచ్చిన బూత్ నాయకులను సన్మానిస్తామన్నారు.

రేవంత్,  కేసీఆర్ ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా మోదీ ముందు పనిచేయవన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్, బిల్డర్లును బెదిరించి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి మోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా సభ్యులు పాపయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:ముంచుకొస్తున్న తాగునీటి గండం