
- సీఎం, మంత్రులు ధర్నాలు, ఆందోళనలు చేస్తే కరోనా రాదా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- ఇంత నిర్బంధం ఎప్పుడూ చూడలేదు
- పోలీసులు లక్ష్మణ రేఖ దాటుతున్నారని ఫైర్
- కేసీఆర్ బానిసలా కరీంనగర్ సీపీ: ఈటల
- పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం: వివేక్ వెంకటస్వామి
- కరీంనగర్ జైల్లో బండి సంజయ్‌ను పరామర్శించిన నేతలు
కరీంనగర్, వెలుగు: ‘రాష్ట్రంలో కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు తప్ప ఇతరులెవరికీ ధర్నాలు, ఆందోళనలు చేసే హక్కు లేదా? సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొంటే కరోనా రాదా? బీజేపీ నేతలు పాల్గొంటేనే వస్తదా? ’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పోరాటాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇన్ని నిర్బంధాలు ఉంటాయని అనుకోలేదని, ఎంపీ బండి సంజయ్ క్యాంప్ ఆఫీసుపై దాడి చేసి అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటనపై సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారని, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కిషన్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామితో కలిసి కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న సంజయ్‌ను మంగళవారం ములాఖత్ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా ముగ్గురు లీడర్లు అరగంట పాటు సంజయ్‌తో మాట్లాడారు. అనంతరం అక్కడ్నుంచి సంజయ్ క్యాంప్ ఆఫీసుకు వచ్చి పరిశీలించారు. ఆయన కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు.
టీఆర్ఎస్ సర్కారుతో కొత్త సమస్యలు
రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు తీరుతాయనుకుంటే టీఆర్ఎస్ సర్కారు తీరుతో కొత్త సమస్యలు వస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు జీవో 317 ఇబ్బందికరంగా మారిందన్నారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా తాము జాగరణ చేస్తుంటే.. సీఎం కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు హద్దులు దాటుతున్నారని, ఎంపీ ఆఫీసు డోర్లను కట్‌చేయడం, సీసీ కెమెరాలు ఎత్తుకపోవడం, కారప్పొడి చల్లడం, మహిళ నేతల మీద దౌర్జన్యం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ మానిటరింగ్‌లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు.
కేసీఆర్ ఆదేశాలతోనే: ఈటల
కరీంనగర్ సీపీ బాధ్యత మరిచిపోయి బానిస లాగా పని చేస్తున్నారని, ఈ ఘటన అంతా సీఎం కేసీఆర్ ఆదేశాలతో జరిగిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎంపీ ఆఫీసుపై జరిగిన ఘటన దురదృష్టం, నీచం, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం అని.. దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని కరీంనగర్ సీపీ గుర్తుంచుకోవాలని, వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పారు. 317 జీవోతో భర్త ఒకదగ్గర, భార్య ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు చేసిన లాఠీచార్జిలో గాయపడిన బీజేపీ నాయకులు, రిమాండ్‌లో ఉన్న బీజేపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయాలపాలైన పార్టీ కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంతెన కిరణ్, నగర సెంట్రల్ జోన్ దళిత మోర్చా అధ్యక్షుడు ప్రసన్నను పలకరించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. సంజయ్ తోపాటు జైలులో ఉన్న పార్టీ కార్పొరేటర్లు కచ్చురవి, పెద్దపెల్లి జితేందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మర్రి సతీశ్, మాజీ ఎంపీపీ పుప్పాల రఘు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
ప్రభుత్వానికి రోజులు దగ్గరవడ్డయ్: వివేక్
సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్మెంబర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయనపై తప్పుడు సెక్షన్లు పెట్టారని ఆరోపించారు. పోలీసులు ప్రజామోదయోగ్యంగా వ్యవహరించాలని.. సీఎం, మంత్రులు మీటింగ్స్ కు కరోనా రూల్స్ వర్తించవా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు అనగానే కరోనా గుర్తుకు వస్తుందన్నారు. 317 జీవో గందరగోళంగా ఉందని పలువురు ఉద్యోగులు తన దృష్టికి తెచ్చారన్నారు. సంజయ్ జైల్లో ధైర్యంగా ఉన్నారని, జీవో సవరించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, బీజేపీతో పెట్టుకొని తలకొరివి పెట్టుకున్నడని కామెంట్ చేశారు.
సంజయ్ రిలీజయ్యే దాకా తరుణ్ చుగ్ ఇక్కడే
హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే వరకు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇక్కడి పరిణామాలపై జాతీయ నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపనున్నారు. 14 రోజుల పాటు నిర్వహించే నిరసన కార్యక్రమాలకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం జరిగే నిరసనలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పాల్గొంటారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు.