కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలు అవినీతి

కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలు అవినీతి

ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రైతుల భూములను లాక్కుంటోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని దీంతో అడ్డగోలుగా అవినీతి జరిగిందన్నారు. ప్రాజెక్టు అంచనా 38 వేల 500 కోట్ల నుంచి లక్షా 20 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ర్ట ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంపై అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

రైతు ఆత్మహత్యల్లో 4వ స్థానంలో తెలంగాణ 

పీఎం అవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంగా మార్చారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా రైతులకు పంటలు ఎలా నష్టపోయినా పరిహారం కేంద్రం అందిస్తుందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెలు, చేపల పెంపకానికి కూడా కేంద్రం ఇస్తున్న నిధులే రాష్ట్ర ప్రభుత్వం వాడుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో ఇవాళ రైతులు అప్పుల పాలయ్యారని తెలిపారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదన్నారు. 

 

అప్పులపై ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉంది

కేంద్ర పథకాల పేర్లను మార్చి.. కొత్త పేర్లు పెట్టి నడుపుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. కనీసం బడ్జెట్ లో పెట్టకుండా, అసెంబ్లీలో చెప్పకుండా అప్పులు తీసుకోవడం వల్ల ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చేసే అప్పుల భారం ప్రజలపైన పడుతుందని చెప్పారు. తెలంగాణలో పుట్టే ఒక్కో బిడ్డపై రూ.1.20 లక్షల అప్పు ఉంటోందన్నారు. రాష్ర్టం చేసే అప్పుల గురించి ప్రశ్నిస్తే కేంద్రంపై కేసీఆర్ సర్కార్ నిందలు వేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ర్ట అప్పుల గురించి మాట్లాడానికి, ప్రశ్నించడానికి కేంద్రానికి పూర్తి అధికారం ఉందని చెప్పారు. అప్పుల గురించి కేంద్రం అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం చెబితే ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా..? అని అన్నారు. 

 

ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టండి

రాష్ర్టాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జాతీయ నాయకుడిగా సీఎం కేసీఆర్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెటైర్ వేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కేసీఆర్ చెప్పే మాటలను వినలేకపోయారని అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రజలకు చేర్చాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా తాము నిలదీస్తామని చెప్పారు. ఈ విషయంలో తమకు బాధ్యత ఉందన్నారు. అప్పుల గురించి రాష్ట్ర ప్రజలకు సమాధానాలు చెప్పిన తర్వాత దేశమంతా తిరగండి అంటూ మండిపడ్డారు. అప్పులపై కేంద్రం కోతలు పెడుతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కామెంట్స్ లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఎనిమిదేళ్లలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు.