కేంద్రం ఫ్రీగా బియ్యం ఇస్తుంటే.. మోడీ ఫోటో ఎందుకు పెట్టలే ?

కేంద్రం ఫ్రీగా బియ్యం ఇస్తుంటే.. మోడీ ఫోటో ఎందుకు పెట్టలే ?
  • రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత..? 
  • అర గంట టైం తీసుకొని చెప్పాలన్న కేంద్ర మంత్రి 

కామారెడ్డి జిల్లా:  కామారెడ్డిలో రెండో రోజు పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ కు క్లాస్ పీకారు. బీర్కూర్ లో రేషన్ షాపును సందర్శించిన ఆమె కలెక్టర్ పై  ప్రశ్నలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోంది కదా.. ఈ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రేషన్ షాపులో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని అడిగితే.. దీనికి కలెక్టర్ సమాధానం చెప్పలేకపోయారు. అయితే అర గంట టైం తీసుకొని సమాధానం చెప్పాలంటూ కలెక్టర్ జితేష్ పటేల్ పై నిర్మలా సీతారామన్  సీరియస్ అయ్యారు.

నిర్మాలాసీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

ఇవాళ ఉదయం కాంగ్రెస్ నేతలు కేంద్రమంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించారు . కాన్వాయ్ కు ఎదురుగా వెళ్లేందుకు యత్నించడంతో కాంగ్రెస్ నేతలను  బీజేపీ లీడర్లు అడ్డుకున్నారు . దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు రెండు పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించారు.

కోవిడ్ సమయంలో మీ సేవలు మరువలేనివి

రెండో రోజు పర్యటనలో భాగంగా కోటగిరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సందర్శించారు. వాక్సినేషన్ జరుగుతున్న తీరుపై సిబ్బందితో చర్చించారు. కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో మొత్తం ప్రపంచమంతా భయంతో వణికిపోతున్న సమయంలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వారి సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి ప్రశంసించారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పొలాల్లోకి వెళ్లి మరి వాక్సినేషన్ చేసారని గుర్తు చేసుకున్నారు. 

కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్

రుద్రూర్ మండల కేంద్రంలో జహిరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ బిజెపి ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలసి ఆమె సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తల పరిస్థితిని, పార్టీ గురించి అడిగి తెలుసుకున్నారు.