
మే నెలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాస్తవానికి ఈ సమయంలో ఎండలు దంచికొట్టాల్సి ఉండగా.. అనూహ్యంగా రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. మే నెలలో చల్లబడిన వాతావరణం ఊహలకు అందని స్థాయిలో పవర్ డిమాండ్ పడిపోవటానికి కారణమైంది.
దీంతో స్పాట్ మార్కెట్ ఇండియన్ పవర్ ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ ధరలు యూనిట్ కి మార్చి నెలలో ఉండాల్సిన దానికంటే సగటున 25 శాతం పడిపోయాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో పవర్ యూనిట్ ధరలు దాదాపుగా సున్నాకు దగ్గరకు చేరుకున్నాయని వెల్లడైంది. వాస్తవానికి వర్షాలతో చల్లబడిన వాతావరణం కారణంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం వాడే ఏసీలు, కూలర్లు, ఫ్రీజర్ల డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోవటమే ధరల పతనానికి కారణంగా ఉంది.
వాస్తవానికి ఈ ఏడాది సమ్మర్లో విద్యుత్ డిమాండ్ మే నెల పీక్ సమయంలో 266 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. దీనికి తగినట్లుగా పవర్ కంపెనీలు, ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. కానీ సడెన్ వర్షాలతో వాతావరణ మార్పుల కారణంగా పీక్ డిమాండ్ కేవలం 231 గిగావాట్లుగా నమోదైంది. మెుత్తానికి ఏడాది ప్రాతిపదికన మే నెలలో పవర్ డిమాండ్ 4 శాతం దేశంలో తగ్గింది. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ కంటే ఉత్పత్తి అధికంగా ఉండటంతో ఎక్స్ఛేంజీల్లో పవర్ ధరలు పడిపోయాయని ఐఈఎక్స్ ఎండీ రోహిత్ బజాజ్ పేర్కొన్నారు.
వాస్తవానికి ఇలా అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి భారతదేశంలో చాలా అరుదుగా కనిపించే పరిస్థితి అని బజాజ్ అన్నారు. ఈ నెలలో ఐఈఎక్స్ లో సగటు పగటి పూట యూనిట్ విద్యుత్ ధర యూనిట్ 56 పైసలుగా నమోదైంది. అలాగే మే 25న ఉదయం నుంచి మధ్యాహ్నం సమయంలో అనేక సార్లు యూనిట్ ధర సున్నాకు దగ్గరకు పడిపోయాయి. మెుత్తం మీద మే 25 తేదీన సగటు విద్యుత్ రోజువారీ ధర రూపాయి 53 పైసలుగా నమోదైంది.
ఈ క్రమంలో దేశంలోని విద్యుత్ పంపిణీ చేసే డిస్కంలు బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ పవర్ కాకుండా తక్కువ ఖర్చుకు లభించే రెన్యూవబుల్ ఎనర్జీని కొనుగోలు చేయటానికి ఎక్కువగా ఇష్టపడ్డాయి. దీనికి కారణంగా అనూహ్యంగా అవసరానికి మించి ఎక్కువ విద్యుత్ వీటి నుంచి ఉత్పత్తి కావటమే. అయితే తగ్గిన ఈ ధరలు సామాన్య వినియోగదారులకు బదిలీ చేయబడవు.
ప్రజలు ప్రతి నెల మాదిరిగానే శ్లాబ్ రేట్ల ప్రకారం తమ కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకైతే విద్యుత్ డిమాండ్ ఊహించినదాని కంటే తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువగా ఉన్న విద్యుత్ ధరలతో దేశంలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ పేర్కొంది. ఈ పరిస్థితులు వాటిని నిరుత్సాహ పరుస్తాయని బ్రోకరేజ్ వెల్లడించింది.