భారత్‌లో యూనివర్సల్ స్టూడియోస్ తొలి థీమ్ పార్క్.. ఆ నగరంలోనే..

భారత్‌లో యూనివర్సల్ స్టూడియోస్ తొలి థీమ్ పార్క్.. ఆ నగరంలోనే..

Universal Studios: దేశంలో ప్రజల జీవిత ప్రమాణాలు, ఆదాయాలు పెరగటంతో చాలా మంది వినోదానికి, ఫ్యామిలీతో తగినంత సమయం గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే అంతర్జాతీయ సంస్థలు సైతం తమ వ్యాపారాలను భారతదేశానికి విస్తరిస్తున్నాయి. 

ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ యూనివర్సల్ స్టూడియోస్ భారతదేశంలో తన మెుదటి థీమ్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని వెల్లడైంది. దేశంలోని వినోద రంగంలో ఇదొక పెద్ద ఘట్టంగా మారనుంది. కంపెనీ దేశ రాజధాని దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో తన ఇండోర్ థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దీనిని 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దీనిని భారతీ ఎంటర్ ప్రైజెస్ అనుబంధ సంస్థ భారతీ రియల్టీ నిర్మించనుంది. 

కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ థీమ్ పార్క్ ఏరో సిటీకి చేరువలో రానుంది. దేశంలోనే అతిపెద్ద వినోద నిర్మాణంగా చేపట్టనున్న పాజెక్టును 2027 మధ్య నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మాల్ లో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇండోర్ వినోద ఉద్యానవనం కోసం కేటాయించారని వెల్లడైంది. కానీ ఇప్పటి వరకు యూనివర్సల్ స్టూడియోస్, భారతీ రియల్టీలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరిస్తూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండోర్ థీమ్ పార్క్.. ఏడాది పొడవునా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అన్ని వయస్సుల వారికి వినోదాన్ని అందించటం కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతోందని నివేదికల ద్వారా తెలిస్తోంది. ఇలాంటి థీమ్ పార్కులను ప్రపంచ వ్యాప్తంగా మరికొన్నింటిని యూనివర్సల్ స్టూడియోస్ కలిగి ఉంది. ఇప్పటికే మినియన్స్, జురాసిక్ వరల్డ్, ఫాస్ట్ & ఫ్యూరియస్,  హ్యారీ పాటర్- నేపథ్య సాహసాలతో థీమ్ పార్కులను యూనివర్సల్ స్టూడియో కలిగి ఉంది.

ఈ థీమ్ పార్క్ రాక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించటంతో పాటు పర్యాటక రంగానికి భారీగా ఊతం ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో మాల్స్ సంస్కృతి పెరగటం, ఇండోర్ వినోదానికి డిమాండ్ పెరుగుతున్న వేళ యూనివర్సల్ స్టూడియోస్ అరంగేట్రం అన్ని వయస్సుల వారినీ ఆకర్షిస్తోంది. ఒప్పందం కార్యరూపం దాల్చితే 2027 నాటికి దిల్లీ నగర నడిబొడ్డుకు హాలీవుడ్ మాయాజాలాన్ని యూనివర్సల్ స్టూడియోస్ తీసుకొస్తుందని తెలుస్తోంది.