కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. పీఎంతో ప్రత్యేకంగా భేటీ అయిన ముకుందన్....ఈ విషయంపై ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
కల నిజమైంది..
ప్రధాని మోడీని కలిసిన విషయాన్ని తెలియజేస్తూ..ఉన్ని ముకుందన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. థ్యాంక్యూ సార్....14 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిశాను. చిన్నప్పుడు మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను కోలుకోలేదు. మీ "కెమ్ చో భైలా" మాట నన్ను కదిలించింది. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడుకలుస్తానా ....గుజరాతీలో మీతో ఎప్పుడు మాట్లాడుతానా అని ఎదురుచూస్తూ వచ్చాను. ఇన్నాళ్ళకు నాకల నిజమైయ్యిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ప్రతీ సలహా ఆచరణలో..
మీ సమయంలో 45 నిమిషాలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా జీవితంలో ఈ 45 నిమిషాలు చాలా మెమరబుల్. మీరు చెప్పిన మాటను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి సూచన నేను ఆచరణలో పెడతాను. మీ సలహాలను ఖచ్చితంగా అమలు చేస్తాను అంటూ ట్వీట్ చేశారు.
హాట్ టాపిక్...
కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ...బిజీ షెడ్యూల్ లో కూడా ఉన్ని ముకుందన్ తో 45 నిమిషాలు సమావేశం కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంపై ఫోకస్ పెట్టిన బీజేపీ...ఇందులో భాగంగా తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో ప్రధాని భేటీ అయ్యారు. దీంతో పాటు కర్ణాటకలో కిచ్చా సుధీప్ బీజేపీకి మద్దతు ప్రకటించారు.కేరళలో కూడా సినిమా తారలకు బీజేపీ స్పేస్ ఇస్తోంది. ఇప్పటికే మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీని బీజేపీ రాజ్యసభకు పంపించింది.
2024 ఎన్నికలపై ఫోకస్
కేరళలో బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఇక్కడ వామపక్షాలు, కాంగ్రెస్‌తో కూడిన LDF, UDF పార్టీలు బలంగా ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటులోనూ గెలవలేదు. కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. .కాంగ్రెస్-16, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-2, కేరళ కాంగ్రెస్ (మురళీధరన్)-1, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ-1 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేరళ లోక్‌సభ ఎన్నికల్లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది.
ఉన్ని ముకుందన్ ప్రాజెక్టులు..
ఉన్ని ముకుందన్ భాగమతి, జనతా గ్యారెజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతను ఇప్పటికే సమంత లీడ్ రోల్ చేసిన యశోద, రవితేజ ఖిలాడి సినిమాలో ప్రత్యేక పాత్రల్లో మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. అయితే ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. మలయాళంలో మాలికాపురం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన జోరు తగ్గింది. అటు తమిళ్ లోనూ అవకాశాలు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే ఉన్ని ముకుందన్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మోడీతో భేటీ కావడం ఇందుకు మరింత బలం చేకూరింది.