అకాల వర్షాలతో రూ.12 కోట్ల మేర పంట నష్టం

అకాల వర్షాలతో రూ.12 కోట్ల మేర పంట నష్టం
  • నీటి మూటలుగా సర్కార్ ​హామీలు 
  • జాడలేని గోదావరి వరద పంట నష్టం
  • రైతుల జీవితాలతో ఆటలాడుతున్న పాలకులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘మాది ఎప్పటికీ రైతు ప్రభుత్వమే.. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాం’.. అంటూ సర్కార్​గొప్పలు చెప్పడం పరిపాటే. అకాల వర్షాలు, తుఫాన్​లు, వరదల టైంలో పంట నష్టంపై ‘మీకు మేం అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు’.. పాలకులు హామీలిస్తారు. పంట నష్టం వివరాలు సేకరించాలంటూ అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తారు. సర్వే రిపోర్టు లు మాత్రం రికార్డులకే పరిమితమవుతున్నాయి తప్పా పరిహారం అందడం లేదు. జిల్లాలో గతే డాది భారీ వర్షాలతో గోదావరి వరదలతో దాదాపు రూ.20కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆ పరిహారం ఊసే లేదు. ప్రస్తుత అకాల వర్షాలతో జిల్లాలో దాదాపు రూ.12 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు అగ్రికల్చర్​ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 

ఆదుకునే వారే లేరు..

ఏటా ప్రకృతి ప్రకోపానికి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలవుతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఓవైపు పంట పెట్టుబడులు పెరగడం, అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తూ సతమతమవుతున్న అన్నదాతకు మరోవైపు అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. దీంతో రైతులు మనోనిబ్బరం కోల్పోతున్నారు. ప్రస్తుత అకాల వర్షాలతో జిల్లాలో 1,180 రైతులకు చెందిన 2,600ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున మక్క పంట దెబ్బతిన్నది. 2,179 ఎకరాల్లో మక్క, 250 ఎకరాల్లో వరి, 145 ఎకరాల్లో పొగాకు పంట నీటిపాలైంది. వీటితోపాటు బొప్పాయి, టమాటా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిర్చి కూడా తడిసింది. అధికారులు పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపిస్తున్నా పరిహారం చెల్లించే విషయంలో పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 

సీఎం వచ్చి చెప్పినదానికే దిక్కులేదు?

గతేడాది జూన్​ నుంచి ఆగస్టు వరకు కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ల కారణంగా గోదావరి వరదలు రావడంతో పరివాహక ప్రాంతంలోని రైతులు అల్లాడిపోయారు. భారీగా పంటలకు నష్టం వాటిల్లింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్​భద్రాచలంలో పర్యటించారు. పంట నష్టంతోపాటు వరదల పరిస్థితిపై ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఇప్పటికీ ఒక్క పైసా వదలలేదని రైతులు అంటున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు రైతులను ఆదుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు గాని, పరిహారం ఇప్పించడంలో మాత్రం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 

పరిహారం కోసం ఆందోళనలు..

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలంటూ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇల్లెందులో మూడు రోజులుగా రైతు సంఘాల నేతలు దశల వారీ ఆందోళనలు చేస్తున్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతంలో బీజేపీ నాయకులు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు.