ఇంట్లోకి వరద వస్తే... గంగమ్మ వచ్చిందని పూజించిన పోలీస్ ఆఫీసర్..

ఇంట్లోకి వరద వస్తే... గంగమ్మ వచ్చిందని పూజించిన పోలీస్ ఆఫీసర్..

మాములుగా ఇంట్లోకి వరద వచ్చిందంటే ఎంత కంగారు పోతాం..? ఇంట్లో సామాన్లన్నీ మునిగిపోయి, ఇల్లంతా వరద నీటితో నిండిపోయి పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. కానీ.. ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇంట్లోకి వరద వస్తే.. గంగమ్మ తల్లి ఇంట్లోకి వచ్చిందని పూజలు చేశారు. యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చంద్రదీప్ అనే పోలీస్ ఆఫీసర్ తన ఇంట్లోకి ప్రవేశించిన వరద నీటికి పూజలు చేశారు. పోలీస్ ఆఫీసర్ వరద నీటికి పాలు, పూలు అర్పించి పూజలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read : వామ్మో..ఇలా చనిపోతున్నారేంటీ

యూపీ సహా ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో చంద్రదీప్ అనే పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి వచ్చిన వరద నీటికి పూజ చేస్తున్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వరద నీటిలో ఈత కొడుతూ జై గంగా మైయా కి అంటూ నినాదాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవాళ ఉదయం డ్యూటీకి బయలుదేరుతుండగా గంగమ్మ తల్లి మా ఇంటికి వచ్చిందని..  ఇంటి గుమ్మం దగ్గర గంగా మాతను పూజించి ఆశీస్సులు పొందానని క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు చంద్రదీప్. చంద్రదీప్ ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం, అతను యూపీ పోలీస్ స్విమ్మింగ్ ఛాంపియన్ అని తెలుస్తోంది. యూపీ పోలీస్ ఛాంపియన్ స్విమ్మర్, నేషనల్ స్విమ్మర్ అని తన బయో ద్వారా తెలుస్తోంది.