వామ్మో..ఇలా చనిపోతున్నారేంటీ..జిమ్లో వర్కవుట్స్ చేస్తుండగా గుండెపోటు..బెంగాల్ యువక్రికెటర్ మృతి

వామ్మో..ఇలా చనిపోతున్నారేంటీ..జిమ్లో వర్కవుట్స్ చేస్తుండగా గుండెపోటు..బెంగాల్ యువక్రికెటర్ మృతి

ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాలు ఎక్కువయ్యాయి. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు.క్రికెట్ ఆడుతూ ఒకరు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు.. కూర్చున్నవారు కూర్చున్నట్లు కూలిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం.. తాజాగా బెంగాల్ కు చెందిన యువ క్రికెటర్ కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

బెంగాల్ కు చెందిన యువ క్రికెటర్ ప్రియజిత్ జిమ్ సెషన్ లో గుండెపోటుతో మృతిచెందాడు. బెంగాల్ అండర్ 16 క్రికెట్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన 22 యేళ్ల ప్రియజిత్.. బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో ఆడాలని, జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని లక్ష్యంతో ఆడుతున్నాడు.  క్రికెట్ లో అద్బుత ప్రతిభ కనబరస్తున్న క్రమంలో ప్రియజిత్ జీవిత ప్రయాణం అర్థంతరంగా ముగిసింది. 

Also Read : 600 ఏళ్ల తర్వాత మళ్ళీ పేలిన అగ్నిపర్వతం..

శుక్రవారం(ఆగస్టు1) ఉదయం జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా చెమటలు పట్టి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో స్నేహితులు, బంధువులు,సహచరులు  శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రియజిత్ అకాల మరణం బెంగాల్ క్రికెట్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రియజిత్ ఘోష్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడాలని, తరువాత భారత జట్టులోకి రావాలని కలలు కనేవారు. 2018-19 సీజన్‌లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) నిర్వహించిన అండర్-16 ఇంటర్-డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసి గుర్తింపు పొందారు.

యువక్రికెటర్ ప్రియజిత్ ఘోష్ ఆకస్మిక మరణం అలాగే ఇటీవల కాలంలో ఇలాంటి అనేక ఘటనలు యువకులలో గుండెపోటు పెరగడం పట్ల ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మరణాలు అధిక వ్యాయామంతో గుండెపై పడే ఒత్తిడి, అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు,ఇతర కారణాల వల్ల సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

వ్యాయామం చేసే ముందు వైద్య సలహా తీసుకోవడం, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం అని డాక్టర్లు సూచిస్తున్నారు.