
అదో చిన్న ఇల్లు. ఇద్దరు వయసు మీద పడిన దంపతులు. చివరి రోజుల్లో ఒకరికి ఇంకొకరు తోడుగా ఉంటున్నారు. సొంతూరు ఉత్తరప్రదేశ్లోని హాజీపూర్ జిల్లా హపూర్ గ్రామం. మిషన్ కుట్టుకుంటూ వచ్చిన డబ్బుతో బతుకుతున్నారు. చాలీచాలని డబ్బులతో సాగే సంసారం. ఓ వైపు జబ్బులు. మందుల ఖర్చు. ఇంతలో పిడుగు లాంటి వార్త వాళ్లకు షాకిచ్చింది. అది మోసుకొచ్చింది .. కరెంటు బిల్లు కలెక్టరు. ఇంట్లోని మీటరు రీడింగు చూసి బిల్లేసి, స్లిప్పు యజమాని షమీమ్ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అసలే సరిగా కళ్లు కనిపించవు కదా.. మిషన్ దగ్గరికి వచ్చిన ఓ పిల్లగాడితో ఎంత బిల్లు వచ్చిందో చూసి చెప్పమని అడిగాడు. 128 కోట్ల 45 లక్షల 95 వేల 444 రూపాయలని చెప్పడంతో కంగుతిన్నాడు. వెంటనే కరెంటు ఆఫీసుకు వెళ్లాడు. ఆయన గోడు ఎవరూ పట్టించుకోలేదు. ‘మా ఇంట్లో వాడేది ఓ ఫ్యాను. లైటు మాత్రమే. టీవీ కూడా లేదు. దీనికి 128 కోట్ల రూపాయలు బిల్లు వస్తుందా? మొత్తం హాజీపూర్ జిల్లాకు వచ్చిన బిల్లు మాకేసారా? మేం చాలా పేదవాళ్లం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి కట్టగలం. ఆ బిల్లు కట్టలేదని మా కరెంటు కనెక్షన్ పీకేశారు’ అంటూ షమీమ్ భార్య నిషా ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నికల్ తప్పిదం వల్లే పేద కుటుంబానికి భారీ బిల్లు వచ్చిందని స్థానిక అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామ్ శరణ్ వెల్లడించారు. వాళ్లు మాకు బిల్లు తెచ్చిస్తే, కరెక్టు చేసి కొత్త బిల్లు ఇస్తామన్నారు.