ఎగ్జామ్​పేపర్​లో జై శ్రీరామ్​, కోహ్లీ.. 50 శాతం మార్కులతో పాస్​ చేసిన ప్రొఫెసర్లు

ఎగ్జామ్​పేపర్​లో జై శ్రీరామ్​, కోహ్లీ.. 50  శాతం మార్కులతో పాస్​ చేసిన ప్రొఫెసర్లు
  • యూపీ వర్సిటీలో అధ్యాపకుల నిర్వాకం..ఇద్దరు ప్రొఫెసర్ల సస్పెన్షన్ 

లక్నో:  అది ఫార్మసీ కోర్సు ఫస్ట్ ఇయర్ పరీక్ష. ప్రశ్నపత్రంలో ‘ఒక కెరీర్ గా ఫార్మసీ’ అని ఓ క్వశ్చన్ ఇచ్చారు. కొందరు స్టూడెంట్లు ఆన్సర్ మధ్యలో జైశ్రీరామ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య అంటూ పేర్లు, సినిమా పాటలతో ప్రశ్నకు సంబంధం లేకుండా జవాబులు రాశారు. దాదాపు అన్ని ప్రశ్నలకూ అడ్డదిడ్డంగా ఆన్సర్లు రాసేశారు. మామూలుగా అయితే వారికి సున్నా నుంచి నాలుగు మార్కులకు మించి రాకూడదు. 

కానీ ఏకంగా 50 శాతానికి పైగా మార్కులతో వారంతా పాస్ అయిపోయారు! ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ టౌన్ లో ఉన్న వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, యూనివర్సిటీకి చెందిన వినయ్ వర్మ, ఆశిష్ గుప్తా అనే ఇద్దరు ప్రొఫెసర్లు18 మంది స్టూడెంట్ల నుంచి లంచం తీసుకుని వారిని పాస్ చేశారంటూ యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ దివ్యాంశు సింగ్ ఆర్టీఐ ద్వారా బయటపెట్టడంతో అసలు విషయం వెలుగుచూసింది. 

పోయినేడు ఆగస్టు 3న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ అతడు రాష్ట్ర గవర్నర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ వర్సిటీని గవర్నర్ ఆదేశించారు. ప్రొఫెసర్లపై వచ్చిన ఆరోపణలపై విచారణకు యూనివర్సిటీ ఓ కమిటీని వేసింది. ఆరోపణలు నిజమేనని కమిటీ బుధవారం నిగ్గు తేల్చింది. దీంతో ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ వీసీ వందనా సింగ్ ప్రకటించారు.