అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌గా ఉపాసన.. విస్తరణకు రూ.8వేల 600 కోట్ల ఇన్వెస్ట్మెంట్

అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌గా ఉపాసన.. విస్తరణకు రూ.8వేల 600 కోట్ల ఇన్వెస్ట్మెంట్

మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల వ్యాపార విస్తరణలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. అపోలో హాస్పిటల్స్‌కు 'డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్'గా ఆమె నియామకం ఫైనల్ అయ్యింది. దేశవ్యాప్తంగా అపోలో చేపట్టబోయే కొత్త ఆసుపత్రి ప్రాజెక్ట్‌ల గ్రోత్, అభివృద్ధి బాధ్యతలను ఇకపై ఉపాసన పూర్తిగా పర్యవేక్షించనున్నారు.

ఈ సరికొత్త ప్రయాణంపై ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. అపోలో హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ భాగస్వామ్యాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆసుపత్రి నిర్మాణాలను ఆమె దగ్గరుండి అమలు చేయనున్నారు. ఇందుకోసం రూ.8వేల 600 కోట్ల భారీ పెట్టుబడితో అపోలో సంస్థ విస్తరణకు ప్లాన్ రెడీ చేస్తున్న వేళ ఆమె ఈ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి కన్న కలలను సాకారం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఉపాసన చెప్పారు. ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి రావాలనే ప్రతాప్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా కొత్త ఆసుపత్రుల రూపకల్పన ఉంటాయని ఆమె పేర్కొన్నారు. రోగులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా సులువుగా చేరుకునేలా, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేలా ఆసుపత్రుల డిజైన్లు ఉండాలన్నారు.

కేవలం ఆరోగ్య రంగంలోనే కాకుండా, ఉపాసన బిజినెస్ పరంగానూ దూసుకెళ్తున్నారు. డిజిటల్ వెల్‌నెస్, కార్పొరేట్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ అయిన 'యూఆర్‌లైఫ్' సంస్థకు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. అపోలో సీఎస్‌ఆర్ విభాగంలో తనదైన ముద్ర వేసిన ఆమె.. ఇప్పుడు నేరుగా ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను నడిపించనున్నారు.

వ్యక్తిగత జీవితంలోనూ ఉపాసన ఇటీవలే తల్లిగా మరో మైలురాయిని అందుకున్నారు. ఇప్పటికే కూతురు క్లింకార కొణిదెల ఉండగా.. ఈ ఏడాది జనవరిలో ఆమె శివ్రామ్, అన్వీర కవలలకు జన్మనిచ్చారు. ఇలా కుటుంబ బాధ్యతలతో పాటు..అపోలో హాస్పిటల్స్ వ్యాపార విస్తరణలోనూ యాక్టివ్ పాత్ర పోషిస్తూ ఉపాసన ముందుకు సాగుతున్నారు.