చెకింగ్ ఆఫీసర్లే డబ్బులు కొట్టేస్తున్నరు

చెకింగ్ ఆఫీసర్లే డబ్బులు కొట్టేస్తున్నరు

 మయామి: మనం తీసుకెళ్లే లగేజీ నుంచి వేసుకున్న చెప్పులదాకా.. అన్నింటినీ చెక్ చేస్తేగానీ అధికారులు ఎయిర్​పోర్టులోకి అనుమతించరు. భద్రతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ప్యాసింజర్లకు చెందిన అన్నిరకాల వస్తువులను తనిఖీ చేస్తారు. ఈ క్రమంలో తనిఖీ చేయాల్సిన ప్యాసింజర్ల బ్యాగుల్లోంచి చెక్ పాయింట్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఆఫీసర్లే డబ్బులు కొట్టేస్తున్నారు. హ్యాండ్ పర్స్​లలో పెట్టుకున్న క్యాష్​ను కాజేస్తున్నారు. 

తమ డబ్బులు పోయాయని ఫిర్యాదులు అందడంతో ఎయిర్​పోర్ట్ అధికారులు నిఘా పెట్టారు. చెక్​పాయింట్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. అక్కడి సిబ్బందే ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్లు బయటపడింది. దీంతో వాళ్లిద్దరిని పోలీసులకు అప్పగించారు. అమెరికా ఫ్లోరిడా స్టేట్​లోని మయామి ఎయిర్​పోర్టులో జరిగిన ఈ చోరీలకు సంబంధించిన వీడియోలు శనివారం బయటపడటంతో వైరల్ అయ్యాయి.

రోజుకు రూ.83 వేలు.. 

మయామి ఎయిర్​పోర్టులోని చెక్ పాయింట్ వద్ద ట్రాన్స్​పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్​ సిబ్బంది జోసు గోంజాలెజ్, లాబరియస్ విలియమ్స్ పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29న ప్రయాణికులు  తమ లగేజీని చెకింగ్ కోసం సెక్యూరిటీ స్కాన్ మెషీన్​పై పెట్టగా.. వాటిల్లోంచి వీళ్లిద్దరూ క్యాష్ కొట్టేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ‘‘వచ్చిన లగేజీని సర్దుతూ స్కానింగ్ మెషీన్​లోకి పంపించడం వీళ్ల డ్యూటీ. అయితే, పనిలోపనిగా లగేజీల్లోంచి డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. ఓ ప్యాసింజర్ లగేజీలో ఉన్న పర్స్ నుంచి 600 డాలర్లను గోంజాలెజ్ తీసి జేబులో పెట్టుకున్నాడు. మరో ప్రయాణికుడి లగేజీలోని నగదును విలియమ్స్ కొట్టేశాడు” అని పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి యావరేజ్​గా రోజుకు వెయ్యి డాలర్లు(రూ.83 వేలు) కొట్టేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వాళ్లిద్దరినీ ఉద్యోగాల నుంచి తీసేశామని,విచారణ కొనసాగుతోందని తెలిపారు.