
- భారత్-రష్యా సంబంధాలు అత్యంత స్థిరమైనవి: జైశంకర్
- రష్యా మంత్రితోనూ భేటీ.. వార్షిక సమ్మిట్‌కు సన్నాహాలు
మాస్కో: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందు ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, ఆర్థిక సహకారం, పెట్టుబడులు, రక్షణ, టెక్నాలజీ, సాంస్కృతిక అంశాలపై చర్చలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో భారత్-, రష్యా సంబంధాలు అత్యంత స్థిరమైనవని లావ్‌రోవ్‌తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో జైశంకర్ పేర్కొన్నారు.
ఈ సంబంధాలు భౌగోళిక రాజకీయ సమన్వయం, నాయకత్వ సంప్రదింపులు, ప్రజల మధ్య సానుకూల భావనల ద్వారా నడుస్తున్నాయని ఆయన వివరించారు. జైశంకర్ మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా, 26వ భారత్-రష్యా వాణిజ్య, ఆర్థిక, వైజ్ఞానిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారం కోసం ఏర్పాటు చేసిన సంయుక్త కమిషన్(ఐఆర్ఐజీసీ–టెక్) సమావేశానికి సహాధ్యక్షత వహించారు. తర్వాత మాస్కోలో జరిగిన భారత్-–రష్యా వ్యాపార ఫోరమ్‌లో ప్రసంగించారు. గతేడాది కజాన్‌లో జరిగిన 22వ వార్షిక సమ్మిట్, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మార్గదర్శనం చేసిందని గుర్తు చేశారు. అలాగే, ఈ ఏడాది చివరలో జరగనున్న తదుపరి సమ్మిట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.