
- ఈ ఏడాది ఏప్రిల్ దిగుమతుల్లో 7.3 శాతం వాటా
- గతేడాది ఏప్రిల్‌లో కేవలం 3.6 శాతమే
- యూఏఈని దాటి నాల్గో స్థానానికి యూఎస్
- ఇండియాకు టాప్ సప్లయర్‌గా కొనసాగుతున్న రష్యా
న్యూఢిల్లీ: క్రూడాయిల్ వినియోగంలో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న ఇండియా, యూఎస్ నుంచి సప్లయ్ పెంచుకుంటోంది. అమెరికా, ఇండియా..రెండు దేశాలు కూడా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్‌ను త్వరలో కుదుర్చుకోనున్నాయి. ఇందులో భాగంగా యూఎస్ నుంచి మరింత క్రూడాయిల్‌ను ఇండియా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ దేశంతో ఇండియాకు వాణిజ్య మిగులు ఉండగా, వ్యాపారాన్ని పెంచి ఈ అంతరాన్ని తగ్గించాలని ప్రెసిడెంట్ ట్రంప్ కోరుతున్నారు.
ఇందులో భాగంగా ఇండియా యూఎస్ నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను మరింత పెంచొచ్చని అంచనా. ప్రస్తుతం అమెరికా, ఇండియాకు నాలుగో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ సప్లయర్‌గా ఉంది. తాజాగా యూఏఈని అధిగమించింది. ఎనర్జీ కార్గో ట్రాకింగ్ కంపెనీ వోర్టెక్సా డేటా ప్రకారం, ఏప్రిల్‌లో ఇండియా యూఎస్ నుంచి 0.33 మిలియన్ బ్యారెల్స్ పర్ డే (ఎంబీడీ) దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్ అయిన 0.17 ఎంబీడీతో పోలిస్తే ఇది రెండింతలు. ఈ ఏడాది మార్చిలో ఈ నెంబర్ 0.24 ఎంబీడీగా ఉంది.
మోదీ వాషింగ్టన్ పర్యటనతో బూస్ట్
ఈ ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల తర్వాత యూఎస్ నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఇండియా పెంచింది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా నుంచి ఇండియా ఎనర్జీ కొనుగోళ్లు 15 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 25 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఇండియా కిందటి నెలలో చేసుకున్న మొత్తం క్రూడాయిల్ దిగుమతుల్లో యూఎస్ వాటా 7.3 శాతంగా ఉంది. యూఏఈ వాటా 6.4 శాతాన్ని అధిగమించింది. అయితే, ఇది సౌదీ అరేబియా (10.4 శాతం), ఇరాక్ (19.1 శాతం), రష్యా (37.8 శాతం) కంటే తక్కువ. మార్చితో పోలిస్తే ఏప్రిల్లో ఆయిల్ దిగుమతుల్లో రష్యన్, ఇరాక్ ఆయిల్ వాటా పెరిగింది. సౌదీ అరేబియా, యూఏఈ వాటా కొంత తగ్గింది.
రష్యా నుంచే ఎక్కువ
రష్యా ఇండియాకు నంబర్ వన్ క్రూడాయిల్ సప్లయర్‌గా కొనసాగుతోంది. ఇండియన్ కొనుగోలుదారులకు బ్యారెల్‌కు సుమారు 5 డాలర్ల తక్కువ రేటుకే ఆయిల్‌ను రష్యా అమ్ముతోంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రోస్‌నెఫ్ట్ సపోర్ట్‌తో నడిచే నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సెక్టార్ రిఫైనరీలు ఈ దేశం నుంచి భారీగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. వోర్టెక్సా అనలిస్ట్ రోహిత్ రాథోడ్ మాట్లాడుతూ, "యూరప్‌కు యూఎస్ ఎక్స్‌పోర్ట్స్ తగ్గడంతో కూడా ఇండియాకు ఈ దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. యూరప్‌కు దగ్గర్లో రిఫైనరీ మూతపడడంతో ఈ బ్యారెల్స్ ఆసియా, ఇండియా వంటి మార్కెట్లకు వెళ్తున్నాయి" అని అన్నారు.
యూఏఈ నుంచి ఇండియాకు ఈ ఏడాది మార్చిలో భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులు జరిగాయని, అందుకే ఏప్రిల్‌లో తగ్గుదల కనిపించిందని వివరించారు. సౌదీ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం గురించి మాట్లాడుతూ, "వాళ్లు ఈస్ట్ ఆసియా, యూరప్‌కు ఎగుమతులు పెంచారు" అని అన్నారు. "ఒపెక్ ప్లస్ ఔట్‌పుట్ పెరుగుతున్నందున, సౌదీ నుంచి ఇండియాకు క్రూడాయిల్ దిగుమతి పెరుగుతుంది” అని అంచనావేశారు. కాగా, సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని సుమారు 23 దేశాలతో కూడిన ఒపెక్ ప్లస్, ఈ ఏడాది మే నుంచి రోజుకు 4 లక్షల బ్యారెల్స్ సప్లై పెంచాలని, జూన్‌లో అదే స్థాయిలో పెంచాలని చూస్తున్నాయి.
పెరిగిన పెట్రోల్ వినియోగం
ఇండియాలో ఈ నెల మొదటి రెండు వారాల్లో పెట్రోల్ డిమాండ్ బాగా పెరిగింది. సమ్మర్ సీజన్ కావడంతో ప్రజల ప్రయాణాలు ఎక్కువయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డేటా ప్రకారం, పెట్రోల్ వినియోగం ఏడాది లెక్కన సుమారు 10 శాతం పెరిగింది. మే 1-15 మధ్య పెట్రోల్ వినియోగం 15 లక్షల టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే టైంలో 13.7 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. కొవిడ్ వలన 2021 మే మొదటి రెండు వారాల్లో పెట్రోల్ వినియోగం బాగా పడింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 46 శాతం ఎక్కువ వినియోగం జరిగింది. డీజిల్ సేల్స్ 2 శాతం పెరిగి 33.6 లక్షల టన్నులకు చేరాయి.