కరోనా కేసుల్లో పీక్ లెవెల్ దాటేశాం

కరోనా కేసుల్లో పీక్ లెవెల్ దాటేశాం
  • త్వరలో పరిస్థితి కుదుటపడుతుంది: ట్రంప్

వాషింగ్టన్: కరోనా కేసుల సంఖ్యలో పీక్ లెవెల్ దాటామని అమరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “కరోనాపై యుద్ధం కొనసాగుతోంది. కొత్త కేసుల్లో పీక్ లెవెట్ దాటాం. త్వరలో పరిస్థితి కుదుటపడుతుంది” అని చెప్పారు. 48 టెస్టింగ్ సెంటర్లకు పర్మిషన్ ఇచ్చామన్నారు. 300 కంపెనీలు, ల్యాబ్ లతో కలిసి ఎఫ్ డీఏ పని చేస్తోందని. టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటామని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెడతామని, అయితే దీనికి టైం పడుతుందన్నారు. ప్రజలను కాపాడుకునేందుకు మెరుగైన చికిత్స విధానాలు కొనసాగిస్తామని చెప్పారు. వివిధ ట్రీట్ మెంట్లకు సంబంధించి 35 క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన తర్వాత ఎకానమీని రీఓపెన్ చేసేందుకు కొత్త గైడ్ లైన్స్ ప్రకటిస్తామని చెప్పారు. మే ఒకటిన ఎకానమీని రీఓపెన్ చేస్తామని ప్రకటించినా.. అంతకు ముందే కొన్ని రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా 6.44 లక్షలకు చేరగా 28 వేల మందికిపైగా మరణించారు.

కేసుల సంఖ్య తగ్గుతోంది: డెబోరా బ్రిక్స్

గడిచిన ఐదారు రోజుల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ మెంబర్ డాక్టర్ డెబోరా బ్రిక్స్ అన్నారు. అమెరికాలో కరోనా మరణాలు పెరుగుతున్నా.. కేసుల సంఖ్య తగ్గడం భరోసా కలిగిస్తోందని ఆమె చెప్పారు. 9 రాష్ట్రాల్లో వెయ్యికన్నా తక్కువ కేసులు ఉన్నాయని, రోజుకు 30 కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఒరెగాన్ స్టేట్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. రోడ్ ఐలాండ్, ప్రొవిడెన్స్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, మొదట్లో న్యూయార్క్ నుంచి కేసులు పెరగాయని, తర్వాత బోస్టన్ నుంచి అక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కరోనా వ్యాప్తి చేయాలని ఎవరికీ ఉండదన్నారు. అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండాలని, ప్రజలందరూ ప్రెసిడెన్షియల్ గైడ్ లైన్స్ పాటించాలని సూచించారు.

చైనా నుంచి పరిహారం అడగండి: ట్రంప్ కు రవి బాత్రా లెటర్

కరోనా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందని, చైనా నుంచి పరిహారం డిమాండ్ చేయాలని ఇండియన్ అమెరికన్, ఆర్థికవేత్త రవి బాత్రా అన్నారు. ఈ మేరకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఆయన లెటర్ రాశారు. కరోనా మూలాల్ని చెప్పకుండా చైనా దాచిందని ఆరోపించారు. తన నిర్లక్ష్యానికి చైనా పరిహారం చెల్లించాల్సిందేనని లెటర్ లో ఆయన పేర్కొన్నారు.