- రాడార్లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలే టార్గెట్
వాషింగ్టన్: ఇరాన్ భూ భాగాలపై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ దీవిపై సోమవారం రాత్రి ఐదు చోట్ల బాంబులతో విరుచుకుపడింది. ముఖ్యంగా ఇరాన్ రాడార్ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిసింది. హర్మూజ్ లో అమెరికా విమానాలపై ఇరాన్ కు చెందిన ఐఆర్‌జీసీ క్షిపణులతో దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో అమెరికా ఇలా ప్రతిచర్యకు దిగినట్లు సమాచారం. ఇరాన్ నుంచి ముప్పును తగ్గించేందుకే చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాలు తెలిపాయి.
రహస్యంగా వరుస దాడులు..
కొన్ని వారాలుగా ఇరాన్‌లోని ముఖ్యమైన ప్రాంతాల్లో అమెరికా పరిమిత స్థాయిలో రహస్యంగా దాడులు నిర్వహిస్తున్నది. అయితే, పూర్తిస్థాయి యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశం ఈ చర్యల వెనుక లేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఖేష్మ్ దీవి సమీపంలో రెండు అమెరికా నిఘా డ్రోన్లను కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది.
