అమెరికాలో వ్యాపిస్తున్న ట్రీట్‌మెంట్ లేని కొత్త ఫంగస్

అమెరికాలో వ్యాపిస్తున్న ట్రీట్‌మెంట్ లేని కొత్త ఫంగస్

ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే.. అమెరికాలో మరో అంటువ్యాధి వ్యాప్తిచెందుతుంది. కాండిడా ఆరిస్ అనే ఫంగస్ అమెరికాను కలవరపెడుతోంది. వాషింగ్టన్ డీసీలోని ఓ నర్సింగ్ హోమ్‌లో 101 కాండిడా ఆరిస్ కేసులు కనుగొనబడ్డాయి. వీటిలో మూడు కేసులకు సంబంధించిన ఫంగస్.. మూడు రకాల యాంటీ ఫంగల్ మందులను కూడా తట్టుకొని సజీవంగా ఉంటోంది. అదేవిధంగా డల్లాస్‌లోని రెండు ఏరియా ఆసుపత్రులలో కూడా 22 ఫంగస్ కేసులను అమెరికా ఆరోగ్య అధికారులు గురువారం గుర్తించారు. ఈ ఫంగస్ ఈస్ట్ నుంచి వచ్చిందని.. ఇది తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఫంగస్ వల్ల బ్లెడ్ ఇన్‌ఫెక్షన్ వచ్చి మరణానికి దారితీస్తోందని వారంటున్నారు. 

అమెరికాలోని సీడీసీకి చెందిన మేఘన్ ర్యాన్ మాట్లాడుతూ.. ఇటువంటి రెసిస్టెన్స్ పవర్ కలిగిన ఫంగస్‌ను తాను మొదటిసారి చూస్తున్నానని ఆయన అన్నారు. ఇది ఒకరి నుంచి మరోకరికి అంటువ్యాధిలా వ్యాపించిందని ర్యాన్ అన్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లో బయటపడిన ఈ ఫంగస్.. మందులకు లొంగదని సైంటిస్టులు తేల్చారు. అదేవిధంగా ఈ ఫంగస్ ఒక రోగి నుంచి మరో రోగికి అంటువ్యాధిలాగా వ్యాపించిందని సీడీసీ నిర్దారించింది. సీడీసీ ప్రకారం.. ఈ కాండిడా ఆరిస్ ఇన్ఫెక్షన్ సోకిన ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలుస్తోంది. అందువల్ల ఈ ఫంగస్‌ను అమెరికా ఆరోగ్య సంస్థ తీవ్రమైన ప్రపంచ ఆరోగ్య ముప్పుగా పేర్కొంది. సీడీసీ ఈ సూపర్ బగ్ గురించి తీవ్ర ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఈ బగ్ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ పవర్ కలిగి ఉంది. కాబట్టి ఇది యాంటీ ఫంగల్ డ్రగ్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని పరీక్షల ద్వారా గుర్తించడం కూడా చాలా కష్టం. 

ఈ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి?

ఈ ఫంగస్‌ను గుర్తించడం అంత సులభం కాదు. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మంది ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. కాబట్టి ఎవరికి ఈ కాండిడా ఆరిస్ ఇన్ఫెక్షన్ సోకిందో లేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం మరియు చలి అనేవి అత్యంత సాధారణ లక్షణాలు. సీడీసీ ప్రకారం.. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో యాంటీబయాటిక్ చికిత్స తర్వాత కూడా లక్షణాలు మెరుగుపడవు. కాగా.. ఈ కాండిడా ఆరిస్ అంటువ్యాధులు డ్రగ్ రెసిస్టెన్స్‌ను ఎందుకు కలిగి ఉన్నాయో మరియు అవి ఎందుకు ఇన్ఫెక్షన్లను కలిగించడం ప్రారంభించాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.