ఇండియాను ఇన్వెస్టిగేట్ చేయనున్న యూఎస్

ఇండియాను ఇన్వెస్టిగేట్ చేయనున్న యూఎస్

టెక్ దిగ్గజాలపై ట్యాక్సుల విధింపు మీద దర్యాప్తు

వాషింగ్టన్: విదేశీ టెక్ సేవల పన్నులపై దర్యాప్తు నిర్వహించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఇన్వెస్టిగేషన్ అమెరికన్ టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని జరగనుంది. గతేడాది ఫ్రాన్స్ లో ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన యూఎస్ ట్రేడ్ రిప్రెసెంటేటివ్ ఆఫీస్.. ఇప్పుడు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తోపాటు ఇండోనేషియా, టర్కీ, ఇండియాలో వాణిజ్య పన్నుల పరిశీలనపై దృష్టి సారిస్తోంది.

‘మా ట్రేడింగ్ పార్ట్ నర్స్ లో చాలా మంది అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేసిన ట్యాక్స్ స్కీమ్స్ ను అవలంబిస్తున్నారని ప్రెసిడెంట్ ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా మా బిజినెస్ లు, వర్కర్స్ ను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవడానికి వాషింగ్టన్ రెడీగా ఉంది. ఆన్ లైన్ అమ్మకాలు, ప్రకటనల నుంచి వచ్చే ఆదాయానికి పన్ను విధించే యత్నాలను మేం వ్యతిరేకిస్తున్నాం. గూగుల్, యాపిల్, ఫేస్ బుక్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి యూఎస్ టెక్ దిగ్గజాలను వారు ఏకాకిని చేస్తున్నారు’ అని యూఎస్ టీఆర్ రాబర్ట్ లైథైజర్ ఓ ప్రకటనలో మండిపడ్డారు.