
అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. గుండె వైఫల్యంతో బాధపడుతున్న 58 ఏండ్ల వృద్ధుడికి శస్త్ర చికిత్స చేసి పంది గుండెను అమర్చారు. వివరాల్లోకి వెళ్తే..
లారెన్స్ ఫాసెట్ అనే వృద్ధుడు నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఆయన వయసు 58 ఏళ్లు. లారెన్స్ ఫాసెట్ గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా..మరికొద్ది రోజులే బతికుతాడని వైద్యులు వెల్లడించారు. ఇతర వ్యాధులు కూడా ఉండడంతో సంప్రదాయ గుండె మార్పిడికి అవకాశం లేదని డాక్టర్లు తెలిపారు.
యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్ డాక్టర్లు లారెన్స్ ఫాసెట్ కు ఎలాగైన గుండెను అమర్చాలని ప్రయత్నించారు. కష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లారెన్స్ ఫాసెట్ కు డాక్టర్లు పంది గుండె అమర్చి ..అతడి ప్రాణం కాపాడారు. రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడి ఆరోగ్యం కూడా మెరుగైంది. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం.
యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్ వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చడం ఇది తొలిసారి కాదు. 2022లో డేవిట్ బెనెట్ అనే వ్యక్తికి పంది గుండెను అమర్చారు. కానీ అతడు రెండు నెలలు మాత్రమే బతికాడు. ఈ విషయం లారెన్స్ కు తెలుసు. అయినా కూడా లారెన్స్ ఫాసెట్ గుండె మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. అయితే తాను మాత్రం నిండు నూరేళ్లు జీవిస్తానని లారెన్స్ ఫాసెట్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
అమెరికాలో మానవ అవయవాలకు కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 2022లో కేవలం 4,100 గుండె మార్చిడి చికిత్సలు జరిగాయి. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు.