
న్యూయార్క్: ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అది ఏమాత్రం తమకు సంబంధించిన విషయం కాదని తేల్చి చెప్పారు. అయితే ఆ రెండూ అణ్వాయుధ దేశాలని, వాటి మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు అతిపెద్ద యుద్ధానికి దారితీస్తాయని ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కదిద్దుకోవాలని అమెరికా కోరుకుంటున్నదని చెప్పారు. గురువారం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఇండియా, పాకిస్తాన్‌ను తాము కంట్రోల్ చేయలేమని ఆయన తెలిపారు. ‘‘పాకిస్తాన్‌తో భారత్‌కు కొన్ని సమస్యలు ఉన్నాయి. భారత్ తీసుకుంటున్న చర్యలకు పాక్ స్పందిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మేం చేయగలిగేది.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడమే. అంతేగానీ ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలో మేం జోక్యం చేసుకోం.
అది ఏమాత్రం మాకు సంబంధించినది కాదు” అని స్పష్టం చేశారు. ‘‘ఆయుధాలు వదిలేయాలని భారత్‌కు చెప్పం. అలాగే పాకిస్తాన్‌కూ చెప్పం. కానీ చర్చల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తాం. ఇది అతిపెద్ద ప్రాంతీయ యుద్ధంగా, అణుయుద్ధంగా మారకూడదని మేం ఆశిస్తున్నాం. ఆ విషయంలో ఆందోళన చెందుతున్నాం. ఇది అణుయుద్ధంగా మారకుండా చూడాల్సిన బాధ్యత రెండు దేశాల్లోని శాంతిదూతలపై ఉంది. ఒకవేళ అణుయుద్ధమే జరిగితే ఇక వినాశనమే. ప్రస్తుతానికి అది జరుగుతుందని మేం అనుకోవడం లేదు” అని తెలిపారు.