లిఫ్ట్​ల నిర్వహణ ఇక ప్రభుత్వానిదే

లిఫ్ట్​ల నిర్వహణ ఇక ప్రభుత్వానిదే
  • పదేండ్లుగా పైసా ఇవ్వని బీఆర్ఎస్​ సర్కార్
  • నిర్వహణ లేక పడావు పడ్డ లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టులు
  • రిపేర్లపై దృష్టి పెట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వం
  • పర్యవేక్షణకు టెక్నికల్  సిబ్బంది నియామకం
  • పైలెట్  ప్రాజెక్ట్​ కింద కోదాడ, హుజూర్ నగర్

 సూర్యాపేట, వెలుగు: పదేండ్లుగా రాష్ట్రంలోని లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో వాటి పరిస్థితి అధ్వానంగా మారింది. రైతులే లిఫ్ట్ ల మెయింటెనెన్స్​ చేసుకోవాల్సి రావడంతో, రిపేర్లు చేయక చివరి ఆయకట్టుకు సాగు నీరందక పంటలు ఎండిపోయేవి. ఇలా రాష్ట్రంలోని లిఫ్ట్​లను నిర్లక్ష్యం చేయడంతో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందకుండా పోతోంది. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.

ఇకపై లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఔట్ సోర్సింగ్  కింద టెక్నికల్  సిబ్బందిని నియమించనున్నారు. ముందుగా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని సాగర్  లెఫ్ట్ కెనాల్  కింద ఉన్న లిఫ్ట్ లను పైలెట్  ప్రాజెక్ట్​లుగా చేపడుతున్నట్లు ఇరిగేషన్  శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో చిన్న తరహా లిఫ్ట్​లను వినియోగంలోకి తెచ్చి ఆయకట్టు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

గతంలో రైతులపైనే భారం..

రైతుల సాగునీటి అవసరాల కోసం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వాలు లిఫ్ట్  ఇరిగేషన్  స్కీమ్​లను ఏర్పాటు చేసింది. అయితే ఈ లిఫ్ట్ ల నిర్వహణ రైతులకు సవాల్ గా మారింది. లిఫ్ట్  నిర్వహణ కోసం ఆ లిఫ్ట్ మోటార్  కెపాసిటీని బట్టి ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లను నియమిస్తారు. వీరు నిత్యం అందుబాటులో ఉండి లిఫ్ట్ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.50 నుంచి రూ.70 వేల వరకు వేతనాలు చెల్లించాలి. లిఫ్ట్ నిర్వహణలో ఇదే పెద్ద ఆర్థిక భారం. దీంతో పాటు మోటార్లలో సాఫ్ట్  ఆయిల్  నింపాల్సి ఉంటుంది‌‌. దీనికి లక్షల వ్యయం అవుతుంది. ఈ ఖర్చు లిఫ్ట్  కాంట్రాక్టర్​ భరించాల్సి ఉంటుంది. కానీ, తమకు బిల్లులు రావడం లేదనే సాకుతో సాఫ్ట్  ఆయిల్  సప్లై  చేయలేదు.

ఈ మొత్తాన్ని గత ప్రభుత్వం భరించలేదు. హుజూర్‌‌నగర్  బై ఎలక్షన్  టైమ్​లో లిఫ్ట్​ల నిర్వహణ భారం ప్రభుత్వమే భరిస్తుందని నాటి సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారు. అయితే అది అమలుకు నోచుకోలేదు. ఆ టైమ్​లో రైతులే ఎకరానికి ఇంత అని వసూలు చేసుకుని(ఎకరానికి సుమారు వెయ్యి చొప్పున) నడిపించుకున్నారు. కొన్నాళ్లకు డబ్బులు ఇచ్చే విషయంలో కొందరు రైతులు కిరికిరి పెట్టడంతో నిర్వహణపై ప్రభావం చూపింది. వీటితోపాటు వాటర్  సప్లై పైప్​ లీకేజీలు మరో పెద్ద సమస్యగా తయారైంది. రైతులు తమ సొంత డబ్బులతో రిపేర్లు చేయించుకున్నారు. ఇలా రైతులు ఇబ్బందులు పడ్డారు.

అధ్వానంగా లిఫ్ట్​లు..

గత ప్రభుత్వం లిఫ్ట్​లకు రిపేర్లు చేయకపోవడం, నిర్వహణ లేక మోటార్లు పని చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. సాగర్  లెఫ్ట్  కెనాల్  కింద సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్  నియోజక వర్గంలో 35, కోదాడ నియోజక వర్గంలో 18 లిఫ్ట్​ ఇరిగేషన్  స్కీమ్స్ ఉన్నాయి. హుజూర్ నగర్  పరిధిలో 9 మాత్రమే పూర్తి స్థాయిలో పని చేస్తుండగా, మరో 12 పాక్షికంగా పని చేస్తున్నాయి. 7 పని చేయకుండా పోయాయి. మరో 7 స్కీమ్​లు శిథిలావస్థలో ఉన్నాయి. ఇక కోదాడ నియోజకవర్గం పరిధిలో 5 మాత్రమే పని చేస్తున్నాయి. వీటి రిపేర్లకు లక్షల్లో ఫండ్స్  రిలీజ్  చేస్తే ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉన్నప్పటికీ గత పభుత్వం నిర్లక్ష్యంతో చాలా లిఫ్ట్​లు పడావు పడ్డాయి.

నిర్వహణ ప్రభుత్వానిదే..

రాష్ట్రంలో లిఫ్ట్​లను ఏండ్లుగా నిర్లక్ష్యం చేయడంతో దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు రైతు కమిటీలపై నిర్వహణ భాద్యత ఉండగా, ఇక నుంచి లిఫ్ట్​ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని చిన్న తరహా లిఫ్ట్​లను అందుబాటులోకి తెచ్చి తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు ప్రారంభించింది. ముందుగా పైలెట్  ప్రాజెక్ట్  కింద హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టులను ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ నెల30 వరకు లిఫ్ట్​ల రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటి పర్యవేక్షణ కోసం టెక్నికల్  సిబ్బందిని ఔట్  సౌర్సింగ్  పద్దతిలో తీసుకొని వారికి ట్రైనింగ్  ఇవ్వనున్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వాచ్ మన్  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 

లిఫ్ట్​ల మెయింటెనెన్స్​ సర్కారుదే..

తీవ్ర నిర్లక్ష్యానికి  గురైన ఎత్తిపోతల పథకాలకు రిపేర్లు చేపించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇక నుంచి ప్రభుత్వమే వాటి మెయింటెనెన్స్​ బాధ్యత తీసుకుంటుంది. పైలెట్  ప్రాజెక్టుగా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలను ఎంపిక చేశాం. ముందుగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వాచ్ మన్  ఉద్యోగాలను కాంట్రాక్ట్  పద్దతిలో ఎంపిక చేస్తాం. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. రిపేర్ల కోసం అవసరమైన ఫండ్స్  వెంటనే రిలీజ్​ చేస్తాం.
- ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్  శాఖ మంత్రి 

నీళ్లు లేక ఆగమైనమ్.. 

నేను పదెకరాల్లో మిరప, పత్తి, వరి వేసిన. బోర్ల మీద వ్యవసాయం చేయాల్సి వస్తోంది. సగం పంటకే ఆ నీళ్లు సరిపోతున్నయ్. మిగిలిన సగం పంట ఎండిపోతోంది. శివగంగ లిఫ్ట్  ఉన్నా మూడేండ్లుగా సరిగా పని చేయలే. నీళ్లు లేక అల్లాడిపోయినం. ఇప్పుడైనా లిఫ్ట్  బాగు చేసి పుణ్యం కట్టుకోవాలె.    - గుగులోత్​ కేవ్లా, నక్కగూడెం

సంతోషంగా ఉంది..

లిఫ్ట్​ల నిర్వహణ భారం ఇప్పటి వరకు రైతులు మీదే ఉండేది. మా దగ్గర డబ్బులు వసూలు చేసి లిఫ్ట్ ల పనులు చేసేవారు. గవర్నమెంట్​ నిధులతో లిఫ్ట్​లు నిర్వహణ చేయాలనుకోవడం సంతోషకరం. అన్ని లిఫ్ట్​లు రిపేర్​ చేసి నీళ్లు ఇచ్చేందుకు కృషి చేయాలి.  - కోటమర్తి సందీప్, గడ్డిపల్లి