ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్, భట్టి ఫెయిల్ : జగ్గారెడ్డి

ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్, భట్టి ఫెయిల్ : జగ్గారెడ్డి

తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్ కుమార్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఫెయిల్ అయ్యారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ సిస్టంను సెట్ చేయడం లేదన్న ఆయన..పార్టీలో ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేరో 100 కోట్లు ఖర్చు పెట్టారని..రేవంత్ రెడ్డి 50 కోట్లు ఖర్చు పెడితే అందరూ పని చేసేవారన్నారు. ఉప ఎన్నికలో డబ్బు ఖర్చు పెడుతామని ఏఐసీసీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. 

పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి ఖాతాలోకి.. ఓడితే మిగతా వారికి అంటగడతారా..? అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి.. జూమ్ మీటింగ్లు ఏంటని ప్రశ్నించారు. మహేష్ గౌడ్ సరిగా పని చేయడం లేదని.. సమన్వయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. నాలుగు నెలలుగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఎందుకు నిర్వహించలేదని అడిగారు. పార్టీకి ఎలాంటి నష్టం జరిగినా మహేష్ గౌడ్దే బాధ్యతన్నారు.

మర్రి శశిధర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు పార్టీని వీడితే కాంగ్రెస్ చాలా నష్టపోతుందని.. దీనికి మల్లు భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై ఏఐసీసీకి లేఖ రాశానని.. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ లకు లేదా అని ప్రశ్నించారు. అందరూ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత గాంధీభవన్ లో ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పే రెండు, మూడు మెడిసిన్లు తన దగ్గర ఉన్నాయని.. భవిష్యత్లో పీసీసీ పదవిస్తే వాటిని ఉపయోగిస్తానని స్పష్టం చేశారు.