- లిఫ్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
- నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు
- ఆగస్టు 15న హుజూర్ నగర్, కోదాడ బస్టాండ్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ/హుజూర్ నగర్, వెలుగు : కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలను అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండు నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్ లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, జిల్లా కలెక్టర్ తోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల్లో రైతులకు అవసరమైన చోట చిన్న, మధ్య తరహా లిఫ్టులు ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నాణ్యతా విషయంలో రాజీపడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.1450 కోట్లతో ముక్తాల్ బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ నిర్మిస్తామని, దీనిద్వారా మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 53 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
ఇప్పటికే 188.32 ఎకరాలకు భూసేకరణ చేసి నష్టపరిహారం అందించినట్లు తెలిపారు. రూ.302.20 కోట్లతో పాలకీడు మండలంలోని జవహర్ జానపహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి 10 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కోమటికుంట, గుండ్లపహాడ్ చెరువులకు నీరు వచ్చేలా కాల్వల ఏర్పాటు చేయాలని సూచించారు. రూ.26.02 కోట్లతో బెట్టే తండా లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తున్నామని చెప్పారు.
జానపాడు, బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం పూర్తయితే పాలకీడు మండలం సస్యశ్యామలం అవుతుందన్నారు. రూ.320 కోట్ల తో నిర్మించనున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మేళ్లచెర్వు, కోదాడ, చిలుకూరు, చింతలపాలం మండలాలకు చెందిన 14,100 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి..
రెండు నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కోదాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. పట్టణ సుందరీకరణ కోసం పనులు చేపట్టామని తెలిపారు. కోదాడ, హుజూర్ నగర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.
రెండు నియోజకవర్గాల్లో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని చెప్పారు. కోదాడలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఆగస్టు 15న ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో కోదాడ, హుజూర్ నగర్ ఆర్డీవోలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, ఆయా నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.
కోదాడ, హుజుర్ నగర్ బస్టాండ్ల ఆధునీకరణ..
కోదాడ బస్టాండ్ కు రూ.16.89 కోట్లు, హుజూర్ నగర్ బస్టాండ్ నిర్మాణానికి రూ.3.52 కోట్లు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పంద్రాగస్టు నాటికి కోదాడ, హుజూర్ నగర్ బస్టాండ్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని, 6 నెలల్లోపు ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తూ బస్టాండ్లలో పార్కింగ్, కాంటీన్, ఏసీ వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న బస్టాండ్లకు మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు.
