కుంగిన భూమి.. ఇండ్లకు పగుళ్లు..

కుంగిన భూమి.. ఇండ్లకు పగుళ్లు..

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. ఈ ఘటనలో 570 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు. దాదాపు 60 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. భూమి కుంగిపోవడంపై అధ్యయనానికి బీజేపీకి చెందిన 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మరో 29 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం మరో 500లకు పైగా కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే అదే ప్రాంతంలో నివసిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రకృతి విపత్తులు, కొండచరియలు విరిగిపడటం, మౌలిక వసతుల కోసం చేపడుతున్న చర్యలు భూమి కుంగిపోవడానికి కారణమని అధికారులు అంటున్నారు. భూమి కుంగుబాటు వల్ల 3000 మందికి పైగా జనం ప్రభావితులయ్యారని జోషిమఠ్ మున్సిపాలిటీ చీఫ్ శైలేంద్ర పవార్ ప్పారు. తొమ్మిది వార్డుల్లో ఈ సమస్య ఉందని, కొండచరియలు విరిగిపడడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పారు. సింఘ్‌ధార్‌, మార్వాడీ ప్రాంతాల్లో పగుళ్లు కనిపిస్తున్నాయని, బద్రీనాథ్‌ ఎన్‌హెచ్‌ సింఘ్‌ధార్‌ జైన్‌, మార్వాడీలోని జేపీ కంపెనీ గేట్‌, అటవీ శాఖ చెక్‌పోస్టు సమీపంలో ప్రతి గంటకూ ఈ పగుళ్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. జిల్లా విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జోషిమఠ్‌లోని 561 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, మార్వాడీలోని జేపీ కాలనీలో భూగర్భంలో నుంచి నీరు ఉబికి వస్తున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే పగుళ్లతో భయభ్రాంతులకు గురైన జనం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పునరావాసం కల్పించాలని ఏడాదిగా డిమాండ్ చేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇండ్లకు వెదురు స్తంభాలను ఆసరాగా పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరింస్తోందని మండిపడుతున్నారు.