లివ్ ఇన్ ​కూ రిజిస్ట్రేషన్ చేయకుంటే జైలు శిక్ష.. యూసీసీలో ప్రతిపాదన

లివ్ ఇన్ ​కూ  రిజిస్ట్రేషన్ చేయకుంటే జైలు శిక్ష.. యూసీసీలో ప్రతిపాదన
  •     అసెంబ్లీలో బిల్లు పెట్టిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్
  •     సమగ్ర చర్చకు ప్రతిపక్షాలు పట్టు
  •     చట్టబద్ధత కల్పిస్తే దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో సీఎం పుష్కర్ సింగ్ ధామి యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును మంగళవారం ప్రవేశపెట్టారు. బిల్లు చట్ట రూపం దాల్చితే.. రాష్ట్రంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్​లో ఉండాలనుకునేవాళ్లు తమ వివరాలను జిల్లా అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 21 ఏండ్ల కంటే తక్కువ వయసున్నవారు తమ పేరెంట్స్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనేది యూసీసీ బిల్లు స్పష్టం చేస్తున్నది. యూసీసీ బిల్లు ప్రవేశపెట్టే ముందు సీఎం పుష్కర్ సింగ్ ధామి ఒరిజినల్ కాన్​స్టిట్యూషన్ కాపీ పట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఈయనకు బీజేపీ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ.. ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’, ‘వందే మాతరం’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యే సీఎం ధామి.. యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ బిల్లుపై చర్చించిన తర్వాత ఓటింగ్ నిర్వహించేందుకు పుష్కర్ సింగ్ ధామి సర్కార్ సిద్ధమైంది. బిల్లు చట్టరూపం దాల్చితే.. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక యూసీసీని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.

హామీ అమలుకు కట్టుబడి ఉన్నం: పుష్కర్ సింగ్ 

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా యూసీసీ అమలుకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం పుష్కర్ సింగ్ ప్రకటించారు. యూసీసీతో అన్ని వర్గాలకు మంచి జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బిల్లు పెట్టామన్నారు. ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. కాగా, బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష నేత యశ్​పాల్ ఆర్య మాట్లాడారు. బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని, స్టడీ చేయడానికి టైమివ్వాలని డిమాండ్​ చేశారు.

యూసీసీ బిల్లు ఎవరికి వర్తించదు?

రాష్ట్రంలోని గిరిజనులకు మినహా మిగతా వారందరికీ వర్తిస్తుంది. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఉత్తరాఖండ్​ పౌరులకూ యూసీసీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. లివ్ ఇన్ రిలేషన్​షిప్ డిక్లరేషన్ సమర్పించకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా 3 నెలల జైలు లేదా రూ.25 వేల జరిమానా లేదా రెండూ విధిస్తారు. రిలేషన్​షిప్ ను రిజిస్టర్ చేయకపోతే గరిష్టంగా 6 నెలల జైలు, రూ.25వేల ఫైన్​ లేదా రెండూ విధిస్తారు.

విడిపోతే పరిస్థితేంటి?

లివ్ ఇన్ బంధం నుంచి విడిపోతే మహిళ భరణం కోసం కోర్టును ఆశ్రయించొచ్చు. రిలేషన్​షిప్ రద్దు నిబంధన కూడా ఉంది. పెండ్లి, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం, దత్తత లాంటి వ్యక్తిగత విషయాల్లో అందరూ సమానమని బిల్లులో పేర్కొన్నారు. పుట్టిన పిల్లలందరికీ హక్కులు ఒకేలా ఉంటాయి. వారసత్వం (తల్లిదండ్రుల ఆస్తితో సహా)లో సమాన హక్కులు ఉంటాయి.

Also Read:ఎగ్జామినేషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం