మట్టి దిబ్బలా ధరాలీ.. 9 మంది సైనికులుసహా ఇంకా దొరకని 59 మంది ఆచూకీ

మట్టి దిబ్బలా ధరాలీ.. 9 మంది సైనికులుసహా ఇంకా దొరకని 59 మంది ఆచూకీ
  •     ఉత్తర కాశీలో ప్రతికూల వాతావరణంలోనే రెస్క్యూ చర్యలు
  •     9 మంది సైనికులుసహా ఇంకా దొరకని 59 మంది ఆచూకీ..
  •     ఇప్పటివరకు 274 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది
  •     ఐదు మృతదేహాలు లభ్యం

డెహ్రాడూన్:   క్లౌడ్‌‌ బరస్ట్‌‌తో ఉత్తరాఖండ్​ రాష్ట్రం ఉత్తర కాశీలో ఖీర్‌‌గంగా నది  ఉప్పొంగి బురద వరద ముంచెత్తిన  ధరాలీ గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఓ వైపు జోరు వర్షాలు కురుస్తున్నా బురదలో కూరుకుపోయిన వారి జాడ కోసం ప్రతికూల వాతావరణంలోనే ఆర్మీ, విపత్తు నిర్వహణ బలగాలు గాలింపు చేపట్టాయి. ధరాలీలో ఇప్పటికే నలుగురు సజీవ సమాధికాగా.. మరొకరి మృతదేహాన్ని బలగాలు గుర్తించాయి.  ఇంకా 59 మంది ఆచూకీ తెలియలేదు. ఇందులో హార్సిల్​ సైనిక స్థావరం కొట్టుకుపోయి గల్లంతైన 9  మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు.  గురువారం ఉదయం  ప్రభావిత ప్రాంతాల నుంచి 61 మందిని రక్షించారు. ఒకరిని తక్షణ వైద్య సహాయం కోసం విమానంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తంగా ఇప్పటివరకు 274 మందిని బలగాలు రెస్క్యూ చేశాయి. ఇందులో 131 మంది గుజరాత్, 123 మంది మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు. వీరందరినీ ఉత్తర కాశీ, డెహ్రాడూన్‌‌కు తరలించారు. కాగా, ధరాలీ గ్రామం మొత్తం మట్టిదిబ్బలా మారిపోయింది.  ఆక‌‌స్మిక వ‌‌ర‌‌ద‌‌లు ఆ గ్రామాన్ని నేల‌‌మ‌‌ట్టం చేశాయి. ఆ ఊరికి చెందిన డ్రోన్ దృశ్యాల‌‌ను అధికారులు రిలీజ్ చేశారు. ఎక్కడచూసినా బురద మేటలు, అందులో కూరుకుపోయిన భవనాలు, దుకాణాలు, వాహనాలు కనిపిస్తున్నాయి.

హెలికాప్టర్లు, అత్యాధునిక ప‌‌రిక‌‌రాలతో రెస్క్యూ

ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో  కీలకమైన రోడ్డు లింకులు తెగిపోయాయి. దీంతో బురద కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు  ఆర్మీ హెలికాప్టర్లు, అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఐటీబీపీ, ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్,  ఆర్మీ, పోలీసు, సహాయక బృందాలు సహాయక, అన్వేషణ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆర్మీ ఎంఐ–17, చినూక్‌‌ హెలికాప్టర్లతో గాలింపు ముమ్మరం చేశారు. మృతదేహాలు, బురదలో చిక్కుకున్నవారిని వేగంగా గుర్తించేందుకు రాడార్లు, స్నిఫర్​ డాగ్‌‌లను ఉపయోగిస్తున్నారు. కాగా, మట్లి హెలిప్యాడ్‌‌ను సీఎం పుష్కర్​సింగ్​ ధామి గురువారం సందర్శించారు. శిథిలాల నుంచి బయటపడ్డవారిని కలిసి, ధైర్యం చెప్పారు.  

దొరికిన కేరళవాసుల ఆచూకీ

ఆకస్మిక వరదల తర్వాత తప్పిపోయిన 28 మంది కేరళ టూరిస్టుల ఆచూకీ దొరికింది. వారంతా సురక్షితంగా ఉన్నారని  వారి కుటుంబ సభ్యులకు స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ బస్సు డ్రైవర్‌‌‌‌తో తాను మాట్లాడినట్టు ఉత్తరాఖండ్‌‌లో ఉంటున్న మలయాళీ ఒకరు విలేకరులతో తెలిపారు. వారి ఫోన్లన్నీ చార్జింగ్​ అయిపోవడంతో స్విచ్ఛాఫ్​ అయ్యాయని, అందుకే వారు కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయారని చెప్పారు. గంగోత్రికి ప్రయాణిస్తున్న ఆ పర్యాటకులు ప్రస్తుతం వరదలు సంభవించిన ప్రదేశానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవ్ ఘాటి సమీపంలో చిక్కుకుపోయారని తెలిపారు. ఐటీబీపీ సిబ్బంది వారిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారంతా బస్సులోనే సురక్షితంగా ఉన్నారని, కానీ వరదల్లో చిక్కుకోవడంతో ఎటూ కదల్లేకపోతున్నారని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.