వ్యాక్సినేషన్‌కు సహకరిస్తలే..తెలంగాణలో ఫస్ట్‌ టైం పందులకు వ్యాక్సినేషన్‌

వ్యాక్సినేషన్‌కు సహకరిస్తలే..తెలంగాణలో ఫస్ట్‌ టైం పందులకు వ్యాక్సినేషన్‌
  •     అంటువ్యాధుల నివారణ కోసమే అంటున్న వెటర్నరీ ఆఫీసర్లు
  •     సహకరించని పెంపకందారులు

మహబూబాబాద్‌‌, వెలుగు : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్రంలో తొలిసారిగా పందులకు వ్యాక్సినేషన్‌ ‌ప్రోగ్రామ్‌ ‌నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వెటర్నరీ ఆఫీసర్లు పందుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం వల్ల పందులు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ను వ్యతిరేకిస్తున్నారు.

పెంపకందారులు సహకరించకపోవడంతో వ్యాక్సిన్లు వేసేందుకు వెటర్నరీ ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 వేల పందులు ఉండగా ఇప్పటివరకు కేవలం 4,200 పందులకు మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

అంటు వ్యాధుల నివారణే లక్ష్యంగా...

గ్రామాలు, పట్టణాల్లో పందులు విచ్చలవిడిగా తిరుగుతుండడంతో వాటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందుల్లో సీజనల్‌గా సంక్రమించే వ్యాధుల మూలంగా క్లోజ్‌ కాంటాక్ట్‌ ఉండే వారికి అంటువ్యాధులు, వైరల్‌ ఫీవర్​తో పాటు , చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక పంది అనారోగ్యానికి గురైతే మంద మొత్తం చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో పందులకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. క్లాసికల్‌ ఫైన్‌ ఫీవర్‌ వ్యాక్సినేషన్‌ చేయడం మూలంగా పందులకు వచ్చే వ్యాధులు తగ్గడంతో పాటు వాటి ద్వారా మనుషులకు అంటుకోకుండా చేయవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. 

పెంపకందారులు సహకరించాలి 

రాష్ట్రంలోనే తొలిసారిగా పందులకు రెండు సార్లు వ్యాక్సినేషన్‌ చేస్తున్నాం. తొలి విడత జనవరి నెలలో ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటివరుక 4,200 పందులకు వ్యాక్సిన్‌ వేశాం. పెంపకందారులు వెటర్నరీ సిబ్బందికి సహకరించాలి. పందులకు క్లాసికల్‌ ఫైన్‌ ఫీవర్‌ రాకుండా సహకరించాలి. 
- డాక్టర్‌ సుధాకర్‌, జిల్లా వెటర్నరీ ఆఫీసర్‌‌, మహబూబాబాద్‌‌