ఇప్పుడే అంత హైప్ వద్దు.. 14 ఏళ్ల వైభవ్‎ కెరీర్ నాశనం చేయకండి: బీసీసీఐకి గ్రెగ్ చాపెల్ సూచన

ఇప్పుడే అంత హైప్ వద్దు.. 14 ఏళ్ల వైభవ్‎ కెరీర్ నాశనం చేయకండి: బీసీసీఐకి గ్రెగ్ చాపెల్ సూచన

14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‎గా మారాడు. ఐపీఎల్ 18లో భాగంగా గుజరాత్‎పై రికార్డ్ సెంచరీ సాధించడంతో వైభవ్ పేరు వరల్డ్ వైడ్‎గా మారుమోగిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ  చూసిన వైభవ్ గురించే చర్చ నడిచింది. అయితే.. సెంచరీ తర్వాత ముంబైతో జరిగిన మ్యాచులో వైభవ్ డకౌట్ అయ్యాడు. దీంతో ఈ బుడ్డోడిపై స్టార్ డమ్‎తో పాటు ఒత్తిడి నెలకొన్నదని చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వైభవ్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ కీలక సూచనలు చేశారు. 

Also Read : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడే అంతా హైప్ సృష్టించి అతడిపై ఒత్తిడి పెంచొద్దని.. ఓవర్ నైట్ స్టార్ డమ్ వల్ల అతడు పక్కదారి పట్టకుండా సరైన మార్గంలో ఎదగడానికి సహాయపడాలని బీసీసీఐకి సూచించాడు. సూర్యవంశీని అతిగా ప్రచారం చేయడం మంచి కాదని హెచ్చరించాడు. ఒత్తిడి, ఓవర్ నైట్ స్టార్ డమ్ నుంచి అతడిని కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐ, ఐపీఎల్ యజమాన్యం, మీడియాపై ఉందన్నారు. అతడి ప్రతిభ గాలి బుడగలా కాకుండా చూడాలన్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్లు సచినన్, వినోద్ కాంబ్లీ, 2018 U19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ పృథ్వీ షా స్టోరీని ఉదహరణగా చెప్పాడు చాపెల్. 

‘‘సచిన్, కాంబ్లీ ఇద్దరూ టాలెంటెడ్ ప్లేయర్స్. సచిన్ కంటే కాంబ్లీనే కాస్తా దూకుడుగా ఆడేవాడు. ఈ ఇద్దరూ తమ అద్భుతమైన ఆటతో కెరీర్ బిగినింగ్‎లోనే స్టార్ డమ్ సంపాదించారు. సచిన్ క్రమశిక్షణతో ఆడి చివరకు టీమిండియా దిగ్గజ క్రికెటర్‎గా ఎదిగాడు. కానీ కాంబ్లీ మాత్రం చిన్న ఏజ్‎లో తక్కువ సమయంలో వచ్చిన స్టార్ డమ్ వల్ల పక్కదారి పట్టాడు. దీంతో అతడి అద్భుతమైన కెరీర్ నాశనమైంది. 2018 U19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ పృథ్వీ షా విషయంలోనూ ఇదే జరిగింది. పృద్వీ షాకు కూడా చిన్నతనంలోనే మంచి పేరు వచ్చింది. టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని కితాబు అందుకున్నాడు. 

కానీ స్టార్ డమ్ వల్ల పృధ్వీ షా పక్కదారి పట్టడంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. వీరు ఎంత తొందరగా ఎదిగారో.. ఒత్తిడి, హైప్ వల్ల అంతకు మించిన వేగంతో పతనం చవిచూశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వైభవ్‎పై అప్పుడు భారీ అంచనాలు, హైప్ పెంచి అతడిని ఒత్తిడిలోకి నెట్టి.. యువ ఆటగాడి కెరీర్ నాశనం కాకుండా బీసీసీఐ చూడాలి’’ అని చాపెల్ పేర్కొన్నాడు. 

కాగా, IPL మెగా వేలంలో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ కెప్టెన్ సంజు సామ్సన్ గాయం కారణంగా అతడి స్థానంలో వైభవ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ తొలి మ్యాచులో ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టి రికార్డ్ సృష్టించాడు. అలాగే.. గుజరాత్ పై కేవలం 35 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించడంతో వైభవ్ పేరు సోషల్ మీడియాలో మోరుమోగిపోయింది. సెంచరీ అనంతరం భారీ అంచనాల నడుమ ముంబైతో మ్యాచ్ కి బరిలోకి దిగిన వైభవ్ డకౌట్ అయ్యాడు.