విశ్వాసం..ఆ స్నేహం నిరుపయోగం! : వైజయంతి పురాణపండ

 విశ్వాసం..ఆ స్నేహం నిరుపయోగం! : వైజయంతి పురాణపండ

అవినయభువామజ్ఞానానాం శమాయ భవన్నపి
ప్రకృతి కుటిలాద్విద్యాభ్యాసః ఖలత్వ వివృద్ధయే
ఫణిభయభృతామస్తూచ్ఛేదక్షమస్తమసామసౌ
విషధర ఫణారత్నాలోకో భయం తు భృశాయతే

ప్రకృతి కుటిలుని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, అజ్ఞానాన్ని తొలగించుకోగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ చివరకు కుటిలత్వాన్నే పెంచుకుంటుంది. పాము పడగ మీద ఉన్న మణుల నుంచి వెలువడే కాంతులు భయాన్ని తొలగించగలవు.

చీకటిలో మానవులకు సర్ప భయం కలుగుతుంది. ఆ సమయంలో పాము తల మీద ఉన్న మణులు భయాన్ని పోగొట్టడానికి బదులు భయాన్నే పెంపొందిస్తాయి. అంటే పాము తల మీద ఉన్న మణుల కంటె పామును చూసిన భయమే ఎక్కువ కలుగుతుంది కదా.. అని భట్టమురారి కవి ‘అనర్ఘరాఘవం’ నాటకం చతుర్థాంకంలో చెబుతున్నాడు.

విద్యను బోధించటానికి గురువుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా గురువు కుటిలుడు అయి ఉండకూడదు. విద్యను దాచుకోకూడదు. విద్యార్థుల పట్ల నిస్వార్థంగా ఉండాలి. గురువు నిత్య విద్యార్థిగా ఉండాలి. అటువంటి గురువులు తమ శిష్యులను సన్మార్గంలో నడపగలుగుతారు. ప్రస్తుత సమాజంలో విద్యను బోధించే గురువులలో కొందరు కుటిలురు కావటం వల్లనే వారు విద్యార్థుల మీద అరాచకాలు జరుపుతున్నారు.

విద్యార్థులకు సద్విద్యను ప్రసాదించవలసిన గురువులే కీచకులుగా తయారవుతున్నారని చెప్పటానికి ఈ శ్లోకం మంచి ఉదాహరణగా నిలుస్తుంది. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు చండామార్కుల వారి వద్దకు విద్యాభ్యాసం కోసం చేరతాడు. అక్కడ ఆయన హిరణ్యకశిపుని ఆదేశాల మేరకు ‘ఓం హిరణ్యకశిపాయ నమః’ అని నేర్పుతాడు. కాని ప్రహ్లాదుడు విష్ణుమూర్తినే ధ్యానిస్తాడు. మంచిని నేర్పవలసిన గురువు కుటిల విద్యను నేర్పటం వల్ల విద్యార్థి సన్మార్గంలో ప్రయాణించలేకపోతాడు.

రామాయణంలో...

రావణుడు సకల విద్యలను అభ్యసించాడు. తన పరిపాలనలో ప్రజలకు మంచిని చెప్పగలిగిన శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ అతనిలోని కుటిల బుద్ధి కారణంగా తన ప్రజలందరూ దురలవాట్లకు బానిసలయ్యేలా పరిపాలించాడు. ఇంటింటా మధుశాలలే. ఇంటింటా మదవతులతో విలాసమే. కుంతీదేవి గర్భాన జన్మించి, సూతుడి ఇంట పెరిగిన కర్ణుడు సర్వ సుగుణాలను కలిగి ఉన్నాడు.

కురుపాండవ విద్యా ప్రదర్శన సమయంలో దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. అది మొదలు కర్ణుడు దుర్యోధనుడికి విధేయుడిగా ఉన్నాడు. కుటిలుడైన దుర్యోధనుని సాన్నిహిత్యంలో కర్ణుడు సైతం ఎన్నో అరాచకాలు చేశాడు. దుష్టచతుష్టయంలో ఒకడిగా నిలిచాడు. 

ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాల గడుగ బోవునా నైల్యంబు
విశ్వదాభిరామ వినురవేమ

ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ, ఎన్ని మంచి మాటలు విన్నప్పటికీ నీచుడు తన చెడ్డ గుణాన్ని విడువలేడు. నల్లని బొగ్గును తెల్లని పాలతో కడిగినంత మాత్రాన బొగ్గులోని నలుపు పోదు కదా. 

ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ తెల్లవారు జామునే నదిలో స్నానం చేసేవాడు. అలా ఒకనాడు స్నానం చేస్తున్న సమయంలో ఒక తేలు కొట్టుకుంటూ కనిపించింది. దానిని చూసి జాలిపడిన ఆ విప్రుడు ఆ తేలును రక్షించాలనే సత్సంకల్పంతో  దానిని చేతిలోకి తీసుకున్నాడు. తనను రక్షించినందుకు కృతజ్ఞత చూపవలసిన  తేలు.. ఆ బ్రాహ్మణుడిని తన తోకతో కాటేసింది. అప్పుడు ఆ విప్రుడు లోకరీతిని అర్థం చేసుకున్నాడు. 

అదేవిధంగా....

ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో ఇటువంటిదే మరో కుటిల నీతిని అవలంబించారు. రెండు రాజ్యాల మధ్యన అంతఃకలహాలు రేపి, లాభపడేవారు. ఒక రాజుకి సహాయపడతామని, మరో రాజు మీదకు దండయాత్ర చేయించి, ఆ రాజు ఓడిన తరువాత, ఇరు రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే బొగ్గు వంటి మనసు ఉన్న ఆంగ్లేయులను సుపరిపాలకులు అనే ఎన్ని పాలతో కడిగినా వారి అంతరంగం కుటిలనీతితో నిండి ఉందే కాని, దానిని విడనాడలేకపోయారు. అందుకే దుష్టులకు దూరంగా ఉండమని, సజ్జనులతో సాంగత్యం చేయమని హితవు పలుకుతున్నారు పెద్దలు.

పంచతంత్రంలో రెండు కోతులు – పిల్లి కథ తెలిసిందే. ఒకసారి రెండు కోతులకు ఒక రొట్టెముక్క దొరికింది. దానిని ఎలా పంచుకోవాలో తెలియక, ఒక పిల్లి దగ్గరకు వెళ్లాయి. ఆ పిల్లి ఒక త్రాసు తీసుకువచ్చి, రెండు వైపులా రెండు ముక్కలు వేసింది. అప్పుడు ఒక వైపు బరువు ఎక్కువ కావటంతో అటు వైపు నుంచి చిన్న ముక్క తుంచి, తినేసింది. ఇలా.. అటు ఎక్కువ అని, ఇటు తక్కువ అంటూ... మొత్తం రొట్టె అంతా తినేసింది. న్యాయంగా వారి తగవు తీర్చవలసిన పిల్లి తన కుటిలత్వాన్ని విడిచిపెట్టలేదు. అలా కోతులు రెండు నష్టపోయాయి. 

వైజయంతి పురాణపండ
ఫోన్ : 80085 51232