పైలట్ అవుదామనుకున్నా!: అధర్వ

పైలట్ అవుదామనుకున్నా!: అధర్వ

ఒకప్పుడు ‘హృదయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని మెలిపెట్టారు మురళి.ఇప్పుడు ఆయన కొడుకు అధర్వ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. నాన్నలాగే డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి దగ్గరైన అధర్వ.. ‘వాల్మీకి’తో నేరుగా టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాడు. ఈ రోజు తన సినిమా విడుదలవుతున్న సందర్భంగా ‘వెలుగు’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు.

తెలుగులో మొదటి సినిమా.. ఎలా ఫీలవుతున్నారు?

చాలా హ్యాపీగా ఉంది. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇదొక స్పెషల్ మూవీ. తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ పెద్ద సక్సెస్‌‌‌‌ అవుతుందనుకుంటున్నాను.

ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ ఎలా వచ్చింది?

హరీష్‌‌‌‌ శంకర్ సంప్రదించారు. ‘జిగర్తాండ’ రీమేక్ అనగానే ఆసక్తి కలిగింది. ఆ సినిమా నేను చూశాను. మంచి కథ, బలమైన కథనం. పాత్రలు కూడా ఎంతో సహజంగా ఉంటాయి. అందుకే ఓకే చెప్పాను.

హోమ్‌‌‌‌ వర్క్ ఏమైనా చేశారా?

అలాంటిదేమీ లేదు కానీ తెలుగు నేర్చుకోవడానికి మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టాను. మా పాత్రలను హరీష్‌‌‌‌ బాగా మలిచారు. మంచి డైలాగ్స్‌‌‌‌ కూడా ఉన్నాయి. అందుకే లాంగ్వేజ్‌‌‌‌పై శ్రద్ధ పెట్టాను. స్కూలు పిల్లాడిలా డైలాగ్స్ బట్టీ పట్టేవాణ్ని. అలా రోజురోజుకీ బెటర్ చేసుకుంటూ వెళ్లాను. ఈ ప్రాసెస్ ఎంజాయ్​ చేశాను.

డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి పరిచయమే కనుక సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉండొచ్చుగా?

ఇవ్వొచ్చు. కానీ ‘వాల్మీకి’లో రోల్ కూడా తక్కువేమీ కాదు. హరీష్‌‌‌‌ స్క్రిప్ట్ రాసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. సినిమా మరింత బాగా పండటానికి కొన్ని

పాత్రలను, సీన్స్​ని యాడ్ చేశారు. అలాంటప్పుడు నా పాత్రని తక్కువ చేయరు కదా. ఓ గ్రాండ్ లాంచింగ్‌‌‌‌ కంటే ఒక మంచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికే ఇష్టపడ్డాను. నా చాయిస్ తప్పు కాదు.

హరీష్‌‌‌‌కి చాలాకాలంగా హిట్స్ లేవు కదా. రిస్క్ తీసుకుంటున్నాను అనిపించలేదా?

ఈ సినిమా కోసం సంప్రదించకముందు ఆయన గురించి నాకేమీ తెలియదు. కానీ రీమేక్‌‌‌‌ అద్భుతంగా చేయగలరని మాత్రం తెలుసు. ‘గబ్బర్‌‌‌‌‌‌‌‌సింగ్’ చూశాను. ‘దబంగ్‌‌‌‌’ని తెలివిగా హ్యాండిల్ చేశారాయన. దీన్ని కూడా అంతే బాగా తీస్తారని నమ్మాను. నా నమ్మకం నిజమేనని మీకు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది.

హరీష్‌‌‌‌కి కోపమెక్కువని అంటుంటారు. మీకూ అది నిజమనిపించిందా?

లేదు. నాకలాంటి అనుభవాలేమీ ఎదురవ్వలేదు. ఆయన చాలా మంచి డైరెక్టర్. తనకేం కావాలన్నది ఆయనకి  క్లియర్‌‌‌‌‌‌‌‌గా తెలుసు.

వరుణ్‌‌‌‌తో పని చేయడం ఎలా అనిపించింది?

తను చాలా కూల్. ఇద్దరిదీ ఒకటే ఏజ్‌‌‌‌ కావడం వల్ల బాగా కలిసిపోయాం. మంచి నటుడు. తను యాక్ట్ చేసిన సినిమాలు నేను చూశాను.

 కోలీవుడ్‌‌‌‌కి, టాలీవుడ్‌‌‌‌కి ఏదైనా తేడా గమనించారా?

పెద్ద తేడా ఏమీ లేదు. అక్కడా మంచి సినిమాలొస్తాయి. ఇక్కడా మంచి సినిమాలొస్తున్నాయి. అక్కడా టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌‌‌‌ ఉన్నారు. ఇక్కడా ఉన్నారు. ఎక్కడైనా మేకింగ్ ఒకటే. సినిమా అనేది ఒక సెపరేట్ ప్రపంచమే. కానీ ఆ ప్రపంచం అన్నిచోట్లా ఒకేలా ఉంటుందనిపిస్తుంది నాకు.

తెలుగు సినిమాలు చూసే అలవాటు ఉందా?

బాగా చూస్తాను. ‘బాహుబలి’ నా ఫేవరేట్ మూవీ. తెలుగు సినిమా గతం కంటే చాలా మారింది. ఎంతో వైవిధ్యభరితమైన సినిమాలు వస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. మాలాంటి యాక్టర్స్‌‌‌‌కి కూడా డిఫరెంట్ రోల్స్ చేసే అవకాశం దక్కుతుంది. అందుకే మంచి అవకాశాలొస్తే నేను తెలుగులో కంటిన్యూ అయ్యే ఆలోచనలోనే ఉన్నాను.

ఆఫర్స్‌‌‌‌ వస్తున్నాయా?

వస్తున్నాయి. కాకపోతే ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాను. కాస్త ఫ్రీ అయ్యాక వాటిపై దృష్టి పెడతాను.

పాత్రల్ని ఎంచుకునేటప్పుడు ఏం ఆలోచిస్తారు?

రొటీన్‌‌‌‌గా ఉంటే నచ్చదు. చేసే పాత్ర ఏదైనా మన ముద్ర ఉండాలి. గుర్తుండిపోవాలి. అందుకే ఒక సినిమాని యాక్సెప్ట్ చేసేటప్పుడు గతంలో ఇలాంటి పాత్ర చేశానా అని ఓసారి చూసుకుంటాను. కంప్లీట్‌‌‌‌గా డిఫరెంట్‌‌‌‌గా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ఓకే అంటాను.

ఇప్పటి వరకూ చేసిన పాత్రల్లో మీ మనసుకు నచ్చింది?

తమిళంలో ‘ఈట్టి’ సినిమాలో అథ్లెట్‌‌‌‌గా నటించాను. హర్డిల్స్‌‌‌‌ రేస్ చాంపియన్‌‌‌‌గా కనిపించాలి కనుక నన్ను నేను ఒక స్పోర్ట్స్‌‌‌‌ పర్సన్‌‌‌‌గా తీర్చిదిద్దుకున్నాను. ఆ సినిమా, ఆ పాత్ర నాకు చాలా ఇష్టం.

గెలుపోటముల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు?

గెలుపు, ఓటమి అనేవి ప్రతి పనిలోనూ ఉంటాయి. దేనినీ మనసుకు తీసుకోకూడదు. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడటంలో తప్పు లేదు కానీ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ వస్తే కుంగిపోవడం, కుమిలిపోతూ కూర్చోవడం తప్పు. దాని నుంచి ఒక పాఠం నేర్చుకుని ముందుకు సాగిపోవాలి. ఇది మా నాన్న నాకు నేర్పించారు.

నాన్నను మిస్ అవుతున్నారా?

చాలా. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఆయన నాకో పెద్ద సపోర్ట్. కానీ నా మొదటి సినిమా రిలీజైన నెలకే చనిపోయారు. అప్పటి నుంచి నా కెరీర్‌‌‌‌‌‌‌‌ని నేనే మలచుకున్నాను. నాకు నేనుగా ఎదిగాను.

నాన్న సినిమాలు చూసే నటన నేర్చుకున్నారా?

లేదు. అలా చేయవద్దని నాన్నే చెప్పారు.  ఎవరిలానో ఉండాలనుకోవద్దు, నీకంటూ నీ సొంత శైలి ఉండాలి, ఎవరి ప్రభావం నీమీద ఉండకూడదు అనేవారు.

ఒక యాక్టర్ కొడుకుని తండ్రితో పోల్చడం కామన్. దానివల్ల ఇబ్బంది పడ్డారా?

మొదట్లో పోల్చేవారు. తర్వాత మానేశారు. ఎందు కంటే నేను నాన్న చేసిన జానర్‌‌‌‌‌‌‌‌ సినిమాలు చేయట్లేదు. నేను చేస్తున్న సినిమాల్లాంటివి నాన్న చేయలేదు. కాబట్టి పోల్చడానికి అవకాశమే లేదు.

యువ హీరోలతో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు?

ఇక్కడ ఎవరూ ఎవరికీ పోటీ కాదు. ఎవరి పని వారికుంది. ఎవరి పాత్రలు వారికున్నాయి. నేనయితే ఎవరినీ కాంపిటీటర్‌‌‌‌‌‌‌‌ అనుకోను. అందరి సినిమాలూ చూస్తాను. నాకు నచ్చితే వాళ్లకి ఫోన్ చేసి మరీ చెప్తాను.

ఫ్యూచర్ ప్లాన్స్‌‌‌‌ ఏంటి? నటనేనా లేక రచన, దర్శకత్వం లాంటివేమైనా చేస్తారా?

ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేవీ లేవు. మరిన్ని వైవిధ్యభరితమైన సినిమాలు చేయాలి. గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించాలి. అంతే.

నాన్న సినిమాల్లో దేనినైనా మీతో రీమేక్ చేయాలనుకుంటే దేనికి ఓకే అంటారు?

నాన్న చేసిన వాటిలో ‘ఇరానియన్’ మూవీ బాగుంటుంది. ‘ఇదయం’ (తెలుగులో హృదయం) కూడా నాకు చాలా ఇష్టం. చాలామంది దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుంది అన్నారు. అయితే అప్పటి సబ్జెక్ట్స్‌ ఇప్పుడు వర్కవుటవుతాయా లేదా అనేది చూసుకోవాలి. మంచి సినిమాలను ఎలా పడితే అలా మార్చేసి తీయడం కరెక్ట్ కాదు. ఈ కాలం వారికి కూడా కనెక్ట్ చెయ్యగలిగే స్క్రిప్ట్ దొరికితే మాత్రం చేయడానికి నేను రెడీ.

నటుడిగా అధర్వ తెలుసు. వ్యక్తిగా అధర్వ ఎలా ఉంటాడు?

సింపుల్‌‌గా ఉంటాడు. నవ్వుతూ ఉంటాడు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు. ప్రతిరోజూ కొత్తగా ఉండాలని ఆశపడతాడు.

ఫ్రీ టైమ్​లో ఏం చేస్తుంటారు?

ప్రస్తుతం పైలట్‌‌ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను పైలట్ అవ్వాలనుకున్నాను. చిన్న వయసులోనే నాన్నను కోల్పోకుండా ఉంటే అయ్యేవాడినేమో.

గుర్తుండిపోయిన ఫ్యాన్ మూమెంట్​?

నా ఇరవై ఆరో బర్త్‌‌డేకి ఒకమ్మాయి ఇరవై ఆరు గిఫ్ట్స్‌‌ పంపించింది. భలే అనిపించింది.

ప్రేమంటే?

అందమైన స్నేహం. అంతకంటే బలమైన బంధం.

పెద్దలు కుదిర్చిన పెళ్లి బెటరా, ప్రేమ వివాహమా?

నాకైతే పెద్దలు కుదిర్చిన పెళ్లి  మీద ఆసక్తి లేదు. ప్రేమ వివాహమే బెటర్. అలా అని నేనేం ప్రేమలో పడలేదు. ఇకముందు పడాలి.

ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు?

అమ్మాయి అంటే రూపం కాదు.. పర్సనాలిటీ. మంచి వ్యక్తిత్వం, క్రియేటివిటీ ఉన్న అమ్మాయిలు నచ్చుతారు.