వనపర్తి జిల్లాలో ఆఫీసర్లే అందినకాడికి దండుకుంటున్నరు

వనపర్తి జిల్లాలో ఆఫీసర్లే అందినకాడికి దండుకుంటున్నరు

 తాజాగా డీజిల్ కుంభకోణం వెలుగులోకి..

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లా వైద్యారోగ్య శాఖ  అవి నీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తూ జిల్లా స్థాయి ఆఫీసర్లే అందినకాడికి దండుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది కూడా అదే దారిలో  నడుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.   కొంత కాలంగా ఈ శాఖలో    అవినీతి జరుగుతుందంటూ తరచూ కథనాలు వచ్చినా.. ఆఫీసర్ల తీరు మారడం లేదు. ప్రభుత్వ పెద్దల సహకారంతో ఎలాంటి విచారణ, చర్యలు లేకుండా  తప్పించుకుంటున్నారనే విమర్శలు విని పిస్తున్నాయి. తాజాగా గవర్నమెంట్ వెహికల్స్ తో పాటు  అధికారుల సొంత వెహికల్స్ కు దర్జాగా డీజిల్ పోయించుకొని ప్రభుత్వ ఖజా నాను  కొల్లగొడుతుండడం చర్చనీయాంశమైంది.

ఇన్​చార్జిలందరిపై ఆరోపణలే..

జిల్లాకు రెగ్యులర్ డీఎంహెచ్ వో లేకపోవడంతో సీనియర్ డాక్టర్లను ఇన్​చార్జి డీఎంహెచ్​వోలుగా  నియమిస్తున్నారు. ఇలా బాధ్యతలు నిర్వహించిన ప్రతి  ఒక్కరూ  అవినీతి అక్రమాలకు పాల్పడుతుండడం  పరిపాటిగా మారింది. జిల్లా  ఇన్​చార్జి డీఎంహెచ్​వో గా పనిచేసిన డాక్టర్ శ్రీనివాసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో  సిజేరియన్ల పేరుతో ఇష్టారాజ్యంగా డాక్టర్ల  పేరిట చెక్కులు జారీ చేసి అక్రమాలకు పాల్పడినట్లు కంప్లైంట్లు వచ్చాయి. ఈ విషయంపై విచారణ జరిపినా.. శ్రీనివాసులు పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన తర్వాత మళ్లీ ఇన్​చార్జి డీఎంహెచ్ వోగా గద్వాల డీఎంహెచ్ వో డాక్టర్ చందునాయక్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన పదవీకాలంలో ఏఎన్ఎం, స్టాప్ నర్స్ ఉద్యోగాలను అమ్ముకోవడం,  ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.  మంత్రి నిరంజన్ రెడ్డి  అండదండలతోనే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుత డీఎంహెచ్ వో రవిశంకర్ ఎన్నో ఏళ్లుగా వనపర్తి ఆఫీస్ లోనే వివిధ  హోదాలలో పనిచేయడం, ఆయా అధికారులు చేసిన తప్పుల్లో  తన పాత్ర కూడా ఉండడంతో వారి తప్పులను బయటకు రాకుండా చూస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.  

దర్జాగా సొంత  వెహికల్స్ కు డీజిల్.. 

జిల్లా కేంద్రంలోని  పెబ్బేరు  రోడ్డులో ఉన్న ‘పవన్ ప్యూర్ ఫ్యూయల్స్’ ​అనే పెట్రోల్ బంక్ లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఖాతా ఓపెన్ చేశారు. ఈ ఆఫీస్ పరిధిలో నాలుగు ప్రభుత్వ వెహికల్స్ మాత్రమే ఉండగా ఆఫీసర్లు మాత్రం వాటితో పాటు తమ సొంత వెహికల్స్​కు టోకెన్లు ఇచ్చి దర్జాగా డీజిల్ పోయించుకున్నట్లు తెలిసింది. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ఖర్చు పేరుతో ప్రతి నెలా లక్షల్లో చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఆర్టీఐ ద్వారా సమా చారం అడిగినా ఆఫీసర్లు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎక్కువగా వనపర్తి జిల్లా ఇన్​చార్జి డీఎంహెచ్ వోగా చందునాయక్ పనిచేసిన కాలంలోనే ఇష్టారాజ్యంగా డీజిల్ చెల్లింపులు చేయడం గమనార్హం. తన సొంత వెహికల్స్​కు డీజిల్ పోయించడంతో పాటు హైద్రాబాద్ లో ఉన్న తన ఇతర వెహికల్స్​కు కూడా  దర్జాగా వనపర్తి పెట్రోల్ బంక్ నుంచి క్యాన్ లలో డీజిల్​ నింపుకొని తీసుకెళ్లడం, తాను పనిచేస్తున్న గద్వాల జిల్లాలోని  గవర్నమెంట్ వెహికల్స్ కు సైతం వనపర్తి బంకు లోనే డీజిల్ పోయించినట్లు క్షేత్రస్థాయి ఎంక్వైరీ లో తేలింది. ఈ ఆరోపణలపై ఆఫీసర్లు నోరు మెదపకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది.  

సమాచారం ఇవ్వలేం  

డీఎంహెచ్ వో ఆఫీస్ పరిధిలో గవర్న మెంట్ వెహికల్స్ డీజిల్ వివరాలు, ప్రతి నెలా  బిల్లుల చెల్లింపుల వివరాలు నేరుగా మీడియాకు ఇవ్వలేం. మీకు  వివరాలు కావాలంటే ఆర్టీఐ ద్వారా అడిగితే ఇస్తాం.  గవర్నమెంట్ స్కీం లు, మీటింగ్ లు లాంటి సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలని  మా పై ఆఫీసర్లు  చెప్పారు. ఇలాంటి సమాచారం కాకుండా వేరే ఏది అయినా ఆర్టీఐ ద్వారా అడిగితేనే  ఇస్తాం.

- డాక్టర్ రవిశంకర్, 
డీఎంహెచ్ వో, వనపర్తి.