వాడీవేడీగా వనపర్తి జిల్లా పరిషత్ సమావేశం

వాడీవేడీగా వనపర్తి జిల్లా పరిషత్ సమావేశం
  • నిధులున్నా తూములు, రెగ్యులేటరీలను ఎందుకు రిపేర్ చేయట్లేదని నిలదీత
  •  అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి
  • తీరు మారకపోతే అవినీతి చిట్టా బయపటపెడతామని హెచ్చరిక
  • వాడీవేడీగా వనపర్తి జిల్లా పరిషత్ సమావేశం


వనపర్తి, వెలుగు:  జూరాల, బీమా ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా చివరి ఆయకట్టు వరకు నీళ్లెందుకు వెళ్లడం లేదని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌ రెడ్డి ఇరిగేషన్ ఆఫీసర్లను నిలదీశారు.  బుధవారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జనరల్‌‌ బాడీ మీటింగ్‌‌కు  కలెక్టర్ యాస్మిన్‌‌ బాషాతో కలిసి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్వల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.  దీనిపై అధికారులు  సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల పరిధిలో పంటలు ఎండుతున్నా సమస్యను పరిష్కరించరా..? అని ప్రశ్నించారు. వనపర్తిలో  సీఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అత్యవసరాల కోసం రూ.5 కోట్ల నిధులు కేటాయించామని,  అయినా తూములు, రెగ్యులేటరీలను ఎందుకు నిర్మించడం లేదని మండి పడ్డారు. చాలాచోట్ల జమ్ము మొలిచి కాల్వలు తెగిపోతున్నాయని,  కనీసం జమ్ము తొలగించడం, తెగిన కాల్వలకు రిపేర్లు కూడా చేయరా అని మందలించారు.

అంబులెన్స్‌‌లకు డ్రైవర్లు లేరు
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉన్న 5 అంబులెన్స్‌‌లకు డ్రైవర్లు లేరని, దాతలు ఇచ్చిన కొత్త అంబులెన్సులను కూడా వృథాగా ఉంచుతున్నారని జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించాలని కోరారు.   జిల్లాలో పలువురు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలకు చెడ్డపేరు తెస్తున్నారని,  అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  జడ్పీలోని కొందరు అధికారులు సభ్యులకు గౌరవం కూడా ఇవ్వడం లేదని, తీరు మారకుంటే  వాళ్ల అవినీతి చిట్టాను బయట పెడతామని హెచ్చరించారు.  వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి మాట్లాడుతూ సీఎం గిరివికాస్ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని, స్థానిక ఎంపీపీ లకు సమాచారం లేకుండానే  అధికారులు ఇష్టానుసారం పనులు చేస్తున్నారని ఆరోపించారు.  
ఇతర జిల్లాల రైతులకు సబ్సిడీ విత్తనాలు
జిల్లా రైతులకు కాకుండా ఇతర జిల్లాల రైతులకు సబ్సీడి విత్తనాలను అందిస్తున్నారని  శ్రీరంగాపూర్ జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్  సభ దృష్టికి తీసుకురాగా మంత్రి ఖండించారు. ప్రభుత్వం విత్తనశుద్ధి కర్మాగారాల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు విత్తనాలు ఇస్తోందని చెప్పారు.  స్థానిక రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇక్కడ సరిపోయిన తర్వాతే ఇతర జిల్లాల రైతులకు ఇస్తున్నట్లు వివరించారు.  వేరుశనగ విత్తనాలను  సబ్సిడీ పై అందించాలని రాజేంద్రప్రసాద్ కోరగా..గతంలో ఈ పద్ధతిని జిల్లాలో అమలు చేశామని,  అవకాశం ఉంటే ఈ సారి కూడా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.   గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించడం లేదని పెద్దమందడి జడ్పీ టీసీ లక్ష్మారెడ్డి, ఎంపీపీ  మేఘా రెడ్డి ఆరోపించగా..  విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి మందలించారు. చిన్న పనులకు కూడా పీఆర్ , ఆర్‌‌‌‌అండ్‌‌బీ శాఖ అధికారులపైనే ఆధారపడాల్సి వస్తుండడంతో  విద్యాశాఖలో ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశామని,  చిన్న చిన్న పనులు కూడా చేయకుంటా ఎలా అని  ప్రశ్నించారు.  తీరుమారకుంటే ఈ విభాగాన్ని రద్దు చేస్తామన్నారు.

లేట్‌గా వచ్చిన మెంబర్లకు మంత్రి క్లాస్
మీటింగ్‌‌కు లేట్‌‌గా రావడంపై సభ్యులకు మంత్రి నిరంజన్‌‌ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. 10.30 కు ప్రారంభం కావాల్సిన మీటింగ్‌‌కు జడ్పీటీసీలు సకాలంలో రాలేదు. కేవలం 5 మంది రావడంతో కోరం లేకపోయినా.. జడ్పీ చైర్మన్ సభను ప్రారంభించారు. 11.30 లకు మంత్రి నిరంజన్ రెడ్డి  వచ్చిన తర్వాత మిగతా వాళ్లందరూ వచ్చారు. ఈ విషయాన్ని లోక్ నాథ్ రెడ్డి మంత్రి  దృష్టికి తీసుకెళ్లగా ఆయన క్లాసు తీసుకున్నారు.  రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ,  ప్రజలు ఎంతో చైతన్యవంతం అయ్యారని గుర్తుచేశారు.  జోలి చెప్పి పొద్దు గడిపే రోజులు పోయాయని, కష్టపని పనిచేస్తేనే  రాజకీయాల్లో రాణిస్తారని హితవు పలికారు.  24 గంటలు ప్రజలు మధ్య ఉండాలని,  సమస్యల పరిష్కరానికి ఉన్న వేధికలను వాడుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ వామన్ గౌడ్, జిల్లాలోని 14 మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

భూగర్భజలాల వృద్ధిలో జిల్లా టాప్
భూగర్భజలాల అభివృద్ధిలో వనపర్తి జిల్లా  రాష్ట్రంలోనే టాప్‌లో ఉందని  మంత్రి నిరంజన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  చెరువుల్లో పూడిక తీయడంతో పాటు కేఎల్ఐ, బీమా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లించి ఏడాది పాటు నిల్వ ఉంచుతుండడంతో 6.6 మీటర్లు పెరిగాయని చెప్పారు.