11రాష్ట్రాల్లో లాంఛనంగా 9వందే భారత్ రైళ్లకు శ్రీకారం

11రాష్ట్రాల్లో లాంఛనంగా 9వందే భారత్ రైళ్లకు శ్రీకారం

దేశవ్యాప్తంగా 11రాష్ట్రాల్లో 9 కొత్త వందే భారత్ రైళ్లను కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు. దేశ అభివృద్ధికి వందేభారత్ రైళ్లు ఓ సూచికని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. వందే భారత్ ట్రైన్స్ తో దేశవ్యాప్తంగా కనెక్టివిటీ మరింత పెరిగిందని తెలిపారు.  

తాజాగా ప్రారంభించిన  తొమ్మిది వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలపనున్నాయి. ఈ 9 వందేభారత్ సర్వీసుల్లో ఏపీ, తెలంగాణకు ఒక్కోటి చొప్పున కేటాయించారు. తెలంగాణలో కాచిగూడ నుంచి  యశ్వంత్ పూర్ మధ్య ఓ రైలు నడవనుంది. అలాగే ఏపీలో  విజయవాడ నుంచి  చెన్నై మధ్య మరో రైలు పరుగులు పెట్టనుంది. 

మిగిలిన ఏడింటిలో బెంగాల్ కు రెండు వందే భారత్ రైళ్లను కేటాయించారు. అటు చెన్నై ఎగ్మోర్ , తిరునెల్వేలి,  రవుర్కెలా పూరీ, కాసర్ గోడ్  తిరువనంతపురంతో పాటు ఉదయ్ పుర్  జైపుర్ మధ్య కొత్త వందే భారత్ రైళ్లు నడవనున్నాయి. కొత్త వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు రాష్ట్రాల్లోని రిలీజియస్, టూరిజం ప్రాంతాల కనెక్టివిటీ పెంచనున్నాయి. కొత్తవాటికి రైల్వేశాఖ ఇప్పటికే ట్రైల్ రన్  లను పూర్తి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. తాజాగా ప్రారంభించిన వాటితో దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 34 కు  చేరింది.