సీతాఫలంతో వెరైటీ వంటకాలు ఇవే..

V6 Velugu Posted on Oct 17, 2021

సీతాఫలం.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు లొట్టలేసుకుంటూ తినే ఫ్రూట్‌. ఇది సీతాఫలాల సీజన్‌. ఈ సీజన్‌ని మరింత కొత్తగా ఎంజాయ్‌ చేయాలంటే.. సీతాఫలాలతో ఈ రెసిపీస్​ ట్రై చేయాల్సిందే.

పాయసం

కావాల్సినవి: 
పాలు – అర లీటర్‌‌
జీడిపప్పు – రెండు టేబుల్‌ స్పూన్లు
కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌
పచ్చికోవా– 50 గ్రాములు
చక్కెర – రెండు టేబుల్‌ స్పూన్లు
సీతాఫలం గుజ్జు – ఒక కప్పు
యాలకుల పొడి– ఒక టీ స్పూన్‌
తయారీ: అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలుపోసి కలుపుతూ కాగబెట్టాలి. పాలు పొంగు వచ్చాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. తర్వాత పచ్చికోవా, పంచదార వేసి.. రెండూ కరిగేవరకు కలపాలి. సీతాఫలం గుజ్జు, యాలకుల పొడివేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే సీతాఫలం పాయసం రెడీ. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని కూల్‌కూల్‌గా తినొచ్చు లేదా  వేడిగా లాగించేయొచ్చు. 

కలాకంద్‌

కావాల్సినవి: 
పాలు – ఒక లీటర్‌‌
నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు
చక్కెర – రెండు టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి – అర కప్పు
సీతాఫలం గుజ్జు – ఒక టేబుల్‌ స్పూన్‌
నెయ్యి– ఒక కప్పు
పిస్తా – అరకప్పు
బాదంపప్పు – ఆరు పలుకులు
తయారీ: ఒక గిన్నెలో అర లీటర్‌‌ పాలు పోసి ఒక పొంగు వచ్చేవరకు కాగబెట్టాలి. తరువాత నిమ్మరసం వేయాలి. పాలు విరిగిపోయాక పలుచటి క్లాత్‌లో వేసి దాంట్లోని నీళ్లు అన్ని  గట్టిగా పిండేస్తే పన్నీర్‌‌ లాగా అవుతుంది. ఇంకో గిన్నెలో మిగిలిన‌ పాలుపోసి సగం అయ్యేవరకు మరగబెట్టాలి. తర్వాత పన్నీర్‌‌ ముద్ద వేసి ఉడికించాలి. చక్కెర వేసి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లో పోసి సమానంగా పరవాలి. బాదంపప్పు, పిస్తా వేసి పూర్తిగా చల్లారాక ముక్కల్లా కోస్తే సీతాఫలం కలాకంద్‌ రెడీ. గాలి దూరని డబ్బాలో పెట్టుకుంటే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది. 

హల్వా

కావాల్సినవి: 
సీతాఫలాలు – మూడు
నెయ్యి – 120 గ్రాములు
రవ్వ– 120 గ్రాములు 
చక్కెర – 40 గ్రాములు
పాలు – ఒక గ్లాస్‌
జాజికాయపొడి– ఒక టేబుల్‌ స్పూన్‌
జీడిపప్పు, బాదంపప్పు, 
కిస్‌మిస్‌ – అన్నీ కలిపి కొద్దిగా
తయారీ: కడాయిలో నెయ్యి వేడి చేసి రవ్వ ఎర్రగా వేగించాలి. తర్వాత చక్కెర వేసి కరిగించాలి. చక్కెర కరిగి పాకంలా అయ్యాక అందులో సీతాఫలం గుజ్జు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇంకో కడాయిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌ వేగించి హల్వా మిశ్రమంలో గరిటెతో కలపాలి. చివర్లో జాజికాయ పొడివేయాలి. మరో ఐదు నిమిషాలు ఉడికిస్తే టేస్టీ సీతాఫలం హల్వా రెడీ.

కేక్‌

కావాల్సినవి: 
చక్కెర పొడి – 130 గ్రాములు
దాల్చిన చెక్కపొడి – రెండు టేబుల్‌ స్పూన్లు
వెన్న – 100 గ్రాములు
గుడ్లు – రెండు
మైదా– ఒకటిన్నర కప్పు
బేకింగ్‌ పౌడర్‌‌ – ఒక టేబుల్‌ స్పూన్‌
అల్లం పౌడర్‌‌ – పావు టేబుల్‌ స్పూన్‌
పాలు – 100 మిల్లీ లీటర్లు
సీతాఫలం గుజ్జు – 275 గ్రాములు
తయారీ: ఒక గిన్నెలో వెన్న, చక్కెర పొడి వేసి క్రీమ్‌లా అయ్యేవరకు కలపాలి. గుడ్లు వేసి మరోసారి అన్నీ బాగా కలపాలి. తర్వాత మైదా, బేకింగ్‌ సోడా, అల్లం పొడి, పాలు వేసి కలపాలి. కేక్‌ ప్లేట్‌ మీద వెన్నరాసి, కొద్దిగా చక్కెరపొడి చల్లాలి. కేక్‌ మిశ్రమాన్ని ప్లేట్‌లో పోసి సీతాఫలం గుజ్జు, యాలకుల పొడి దానిపైన చల్లాలి. ఒవెన్‌ను 180 డిగ్రీలు ప్రి హీట్‌ చేసి, కేక్‌ప్లేట్‌ని ఒవెన్‌లో ఉంచి 45 నిమిషాలు బేక్‌ చేయాలి. తర్వాత ఒవెన్‌ నుంచి బయటికి తీసి ఐదు నిమిషాలు అయ్యాక ముక్కలు కోయాలి.  

కుల్ఫీ

కావాల్సినవి: 
పాలు –  లీటర్‌‌‌‌
సీతాఫలం గుజ్జు – ఒక కప్పు
చక్కెర – పావుకప్పు
తయారీ: అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలుపోసి వాటిని గరిటెతో  కలుపుతూ 
సగం అయ్యేవరకు కలుపుతూ మరిగించాలి.  
తర్వాత చక్కెర వేసి ఐదు నిమిషాలు కలపాలి. పాలు కొద్దిగా రంగు మారాక స్టవ్‌‌ ఆపేయాలి. పాల మిశ్రమం పూర్తిగా చల్లారాక  సీతాఫలం గుజ్జువేసి కలపాలి. తర్వాత కుల్ఫీ మౌల్డ్స్‌‌లో వేసి ఫ్రిజ్‌‌లో పెట్టాలి. గడ్డకట్టిన తర్వాత బయటికి తీసి నీళ్లలో ముంచి మౌల్డ్స్‌‌లో నుంచి బయటికి తీస్తే  సీతాఫలం కుల్ఫీ రెడీ. 

లస్సీ

కావాల్సినవి: 
సీతాఫలం గుజ్జు – ఒక కప్పు
పెరుగు – ఒక కప్పు
చక్కెర – రెండు టేబుల్‌‌‌‌ స్పూన్లు
యాలకుల పొడి – కొద్దిగా 
ఐస్‌‌‌‌ క్యూబ్స్‌‌‌‌ – కొన్ని
నిమ్మరసం – ఒక టేబుల్‌‌‌‌ స్పూన్‌‌‌‌
డ్రైఫ్రూట్స్‌‌‌‌ పలుకులు – కొన్ని
తయారీ: పెరుగు, సీతాఫలం గుజ్జు, నిమ్మరసం, చక్కెర కలిపి బ్లెండ్‌‌‌‌ చేయాలి. ఒక వేళ ఆ మిశ్రమం మరీ చిక్కగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుని మరోసారి బ్లెండ్‌‌‌‌ చేయాలి. దాన్ని ఒక గ్లాస్‌‌‌‌లో పోసుకుని డ్రై ఫ్రూట్స్‌‌‌‌తో గార్నిష్‌‌‌‌ చేయాలి. చక్కెర తక్కువైనట్లు అనిపిస్తే కొద్దిగా కలపొచ్చు. సర్వ్‌‌‌‌ చేసేముందు ఐస్‌‌‌‌క్యూబ్స్‌‌‌‌ వేస్తే చల్లటి సీతాఫలం లస్సీని ఎంజాయ్‌‌‌‌ చేయొచ్చు. 

మంచి చేస్తుంది

సీతాఫలం టేస్ట్‌‌లోనే కాదు పోషక విలువల్లో కూడా సూపర్‌‌‌‌. ఈ ఫలంలో ఐరన్‌‌, పాస్ఫరస్‌‌, మెగ్నీషియంతో పాటు విటమిన్‌‌ – సి   పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే విటమిన్‌‌ బి6 ఆస్తమా పేషెంట్లకు మంచి చేస్తుంది. బీపీ, కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది సీతాఫలం. దాంతో పాటుగా జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. ఈ పండు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

Tagged sweet, variety recipes making with custard apple, lossy, kulifie

Latest Videos

Subscribe Now

More News